
నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సల్స్ రహిత భారతాన్ని సృష్టించే యజ్ఞంలో పురోగమిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ప్రకటించారు. నక్సలిజం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 12 నుంచి 6కి తగ్గించామని పేర్కొన్నారు. 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని భారత్ లక్షిస్తోందన్నారు. దేశంలో నక్సలిజం ప్రభావిత జిల్లాలు 38 ఉండగా, వాటిలో 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఇప్పుడు అవి ఆరుకు తగ్గాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. 38 నక్సలిజం ప్రభావిత జిల్లాల్లో ఆందోళనకర జిల్లాలు ఉన్నాయనీ, వాటిలో అల్లూరి సీతారామ రాజు జిల్లా (ఆంధ్రప్రదేశ్), భద్రాద్రి-కొత్త గూడెం జిల్లా (తెలంగాణ) కూడా ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న గట్టి చర్యల వల్ల తెలంగాణలోని ములుగు జిల్లాలో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని వివరించింది. నక్సలిజం వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో రూ.30 కోట్లతో, ఆందోళనకర జిల్లాల్లో రూ.10 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని, ఈ నిధులను కేంద్రం ప్రత్యేక సహాయంగా అందించిందని హోం శాఖ వెల్లడించింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల వరుస కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.





