
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఎరాన్ పట్టణంలో 150 సంవత్సరాల క్రితం విరిగిపోయిన గుప్తుల కాలం నాటి నరసింహ విగ్రహాన్ని భారత పురావస్తు సర్వే సంస్థ పునరుద్ధరించి ప్రతిష్టించింది. దూకుడుగా కాకుండా నవ్వుతూ కనిపించే ఈ 8 టన్నుల శిల్పం ఈ ప్రాంతంలోని ఇతర చారిత్రాత్మక దేవాలయాలతో పాటు ఎత్తుగా నిలుస్తుంది. పునరుద్ధరణ ప్రక్రియలో దాని పురావస్తు ప్రాముఖ్యతను కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంది.
భోపాల్ నుండి 160 కి.మీ దూరంలో చక్రవర్తి సముద్రగుప్త శాసనాలలో ఐరికినాగా ప్రస్తావించబడిన బినా నది ఒడ్డున ఉన్న ఎరాన్, చరిత్ర ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. దీని శిథిలాలను 1874-75లో బ్రిటిష్ ఆర్మీ ఇంజనీర్ నుండి పురావస్తు శాస్త్రవేత్తగా మారిన అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కనుగొన్నారు. నరసింహ విగ్రహం నేలపై పడి ఉన్నప్పటికీ, మోకాళ్ల వద్ద దెబ్బతినడంతో పాటు పాదాల వద్ద విరిగిపోయింది.
150 సంవత్సరాలుగా నరసింహ విగ్రహం విరిగిపోయింది
“గుప్తుల కాలం నాటి మూడు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి: ఒక వైష్ణవాలయం, ఒక వరాహస్వామి ఆలయం మరియు ఒక నరసింహ ఆలయం. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1874-75లో ఈ స్థలాన్ని సందర్శించి ‘బుందేలఖండ్ మరియు మాల్వా పర్యటన’ అనే నివేదికను ప్రచురించారు. అక్కడ ఒక విరిగిన మండపం ఉందని, కానీ (నరసింహ) విగ్రహం గురించి పెద్దగా సమాచారం లేదని ఆయన అన్నారు,” అని ASI జబల్పూర్ సర్కిల్ సూపరింటెండింగ్ పురావస్తు శాస్త్రవేత్త శివకాంత్ వాజ్ పేయి తెలిపారు.
150 సంవత్సరాలుగా విగ్రహం విరిగిపోయింది. “గతంలో దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి విజయవంతం కాలేదు” అని వాజ్ పేయి అన్నారు. ఆరు నెలల క్రితం కొత్త పునరుద్ధరణ ప్రాజెక్ట్ ద్వారా ఈ నరసింహ విగ్రహం తిరిగి పునః ప్రతిష్టించామన్నారు. “సంరక్షణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొదట, ఏవైనా భాగాలు తప్పిపోయాయో లేదో తెలుసుకోవడానికి ఒక అచ్చును సిద్ధం చేశారు. “పని కోసం అనేక బృందాలను నియమించారు. సీనియర్ అధికారులు ఆ ప్రదేశంలో పనిని పర్యవేక్షించారు. బేస్పై లోడ్ వేసి నిర్మాణాన్ని నిర్మించడానికి నాలుగు రోజులు పట్టింది” అని ఆయన తెలిపారు.
“ఇది గొప్ప పురావస్తు ప్రాముఖ్యత కలిగిన అరుదైన నిర్మాణం, కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా తీసుకున్నామని చెప్పారు. సాధారణంగా, నరసింహుడి విగ్రహాలలో ఆహార్యం కోపంగా, దూకుడుగా ఉంటుందని, కానీ ఈ విగ్రహం నవ్వుతూ కనిపిస్తుంది” అని వాజ్ పేయి అన్నారు.





