
ఓ వైపు జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్‌లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు దాడులతో రెచ్చిపోతున్నారు. మంగళవారం పుల్వామాలోని ద్రద్గమ్‌లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఒక్కసారిగా అటువైపు వచ్చిన ఓ ఉగ్రవాది 6-7 రౌండ్ల కాల్పులు జరిపిఅక్కడ్నుంచి పరారయ్యారు. వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తం కావడంతో అక్కడ ఎలాంటి హాని జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల నేపథ్యంలో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు మొత్తం 27 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు రాగా.. వారిలో ఇప్పటికే నలుగురు వారి దేశాలకు తిరిగి వెళ్లారు. దీంతో 23 మంది మాత్రమే జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం గమనార్హం. పలువురు రాజకీయ పార్టీ నేతలను జమ్మూకాశ్మీర్‌కు వెళ్లకుండా కేంద్రం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా, జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామాలో ఉగ్రవాదులు దాడులకు దిగారు. బిజ్‌బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్ డ్రైవర్‌ను దారుణంగా చంపేశారు. ఆర్టీకల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌లో కాశ్మీరేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కాగా, బాధిత ట్రక్ డ్రైవర్‌ను జమ్మూకు చెందిన నారాయణ్ దత్‌గా గుర్తించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





