News

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే – ప్రధాని

435views

గ్రవాదాన్నిపెంచి పోషించే దేశాలపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో సోమవారం తనను కలిసి యురోపియన్ యూనియర్(ఈయూ) ఎంపీలతో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందే. దీనికి అందరూ సహకరించాలి’అని పిలుపునిచ్చారు. ఈయూ ఎంపీల బృందం జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లేందుకు ఇక్కడకు చేరుకున్నారు. దీన్లో భాగంగా ముందుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎంపీలు దేశంలోని పలు ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంది. ఈయూ పార్లమెంట్ సభ్యుల పర్యటన ఫలప్రదం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ముఖ్యంగా జమ్మూ, కాశ్మీర్, లడఖ్ పర్యటన ద్వారా అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, మత వైవిధ్యాన్ని అర్ధం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈయూ ఎంపీలతో మోదీ సమావేశానికి సంబంధించి వివరాలు పీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. జమ్మూ,కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రాధాన్యతలపై వారికొక స్పష్టత వస్తుందని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న శక్తులపై తక్షణం కఠిన చర్యలు ఉంటాలని ఈ సందర్భంగా ప్రధాని నొక్కిచెప్పారు. సులభతర వ్యాపారంలో భారత్ మెరుగైన ప్రతిభను కనబరుస్తోందన్న ప్రధాని 2014లో 142 ర్యాంకులో ఉండగా ఇప్పుడది 63కు ఎగబాకినట్టు వెల్లడించారు. జనాభాపరంగానే కాకుండా వైవిధ్యంలోనూ దేశం ముందుందని ఆయన అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీర్చడానికి అనువువైన విధానాలు రూపొందించి ముందుకెళ్తున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ లివింగ్ లక్ష్యంగా ప్రజలందరికీ ప్రయోజనం చేయడానికి కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్‌ను ఆయన ప్రస్తావించారు.
2025 నాటికి దేశం నుంచి క్షయ వ్యాధిని పారదోలడానికి కార్యోన్ముఖులమై ఉన్నామని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలను ఈయూ ఎంపీల దృష్టికి తెచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజల్లో అవగాహనకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. తమ హయాంలోనే భారత్‌లో పర్యటించాలని ఈయూ ఎంపీలు నిర్ణయించుకోవడం ముదావహం అన్న ప్రధాని వారిని ఈ  సందర్భంగా అభినందించారని పీఎంఓ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.