
హరిద్వార్ కాలేజీ క్యాంపస్‌ను వేదిక చేసుకుని కొందరు ముస్లిం విద్యార్థులు ‘ఇఫ్తార్’ విందును నిర్వహించడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ ఘటనను బజరంగ్ దళ్ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ కాలేజీ ఎదుట నిరసనలకు దిగారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న రిషికుల్ ఆయుర్వేదిక్ కాలేజీలో ముస్లిం విద్యార్థులు ఇఫ్తార్ విందు ఇవ్వడంతో పాటు బయట వ్యక్తులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
సమాచారం తెలిసిన బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున కాలేజీ ఎదుట నిరసనలకు దిగారు. ఇఫ్తార్ విందుతో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు వారిని శాంతపరిచేందుకు ప్రయత్నించారు.
ఇస్లామిక్ జీహాదీ కుట్రలు..
బజరంగ్ దళ్ ఆఫీస్ బేరర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ, రిషికుల్ ఆయుర్వేదిక్ కళాశాలకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఏర్పాటు చేసిన రిషికుల్ విద్యాపీఠం కింద ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటయిందని చెప్పారు. వైద్యవిద్య కోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడకు విద్యార్థులు వస్తుంటారని తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం హరిద్వార్‌లో హిందూయేతర కార్యక్రమాల నిర్వహణపై నిషేధం ఉందని వివరించారు. మతప్రాధాన్యత ఉన్న సిటీలో ఇస్లామిక్ జీహాదీకి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇఫ్తార్ పేరుతో విందుకు బాధ్యులైన విద్యార్థులపై మూడు రోజుల్లోగా యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే తమ నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
దర్యాప్తునకు ఆదేశం
కాగా, కాలేజీ పాలకవర్గం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా క్యాంపస్‌లో పార్టీ నిర్వహించినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని రిషికుల్ ఆయుర్వేదిక్ కాలేజీ డైరెక్టర్ జీసీ సింగ్ తెలిపారు. “కొందరు విద్యార్థులు అక్కడికి ఆహార పదార్ధాలు తీసుకువచ్చారు. మేము వెళ్లి ఆ పార్టీని నిలిపివేశాం” అని చెప్పారు. దీనిపై కాలేజీ టీచర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.





