( మార్చి 11 – శ్రీ వెంకయ్య స్వామి జయంతి )
భారతదేశం అత్యున్నతమైన ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన పుణ్యభూమి. ఎందరో ఆధ్యాత్మిక గురువులు, అవతార పురుషులు, మహర్షులు జన్మించిన యోగభూమి. అలా భారతావనిలో నడయాడిన ఎందరో అవధూతలలో ఒకరు గొలగమూడి వెంకయ్య స్వామి. చీటీల స్వామిగా పిలవబడే ఈయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గొలగమూడి ప్రసిద్ధ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. వెంకయ్య స్వామి చీటీలో ఏదైనా రాస్తే అది తప్పకుండా జరిగి తీరుతుందని ఎంతో మంది చెబుతారు. ఆయన చాలా మహిమ కలిగినవారని ఎంతోమంది ఎన్నెన్నో కథలు కూడా చెబుతారు. సమాధి చెందినా సరే తన భక్తుల వెంట ఉంటానని, వారి కోరికలను తీరుస్తానని వెంకయ్య స్వామి చెప్పారు.
అవధూతలు ఈ ప్రపంచం నిర్ణయించిన పరిధిలో ఇమడరు. అందువల్ల చాలాసార్లు ప్రజలు వారిని గుర్తించక పిచ్చివారని లెక్కకడుతుంటారు. వెంకయ్య స్వామి విషయంలో కూడా అదే జరిగింది. ఎప్పుడూ ఎవరిని పట్టించుకొనక ‘చాకలి యోగం, మంగలి యోగం డుబుడుక్..డుబుడుక్..’ అంటూ తిరుగుతున్న వెంకయ్యను పిచ్చి వెంకయ్యగా ప్రజలు పిలుచుకునేవారు. ఆయన పిచ్చివాడుకాదని మనస్సులోని కోరికలను శుభ్రం చేసుకోమని, చెడు తలపులను శుభ్రం చేసుకోమని చెప్పే భవరోగ వైద్యుడైన భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని తెలుసుకున్న ప్రజలు ఆ తర్వాత ఆయన్ను అవధూత శ్రీ వెంకయ్య స్వామిగా ఆరాధించడం ప్రారంభించారు.
శ్రీ వెంకయ్య స్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అనే పుణ్యదంపతులకు 1887 మార్చి 11న జన్మించారు. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కానీ సత్యవ్రతమును చిన్ననాటి నుంచే ఆచరించారు. అన్ని జీవులను సమానంగా చూసేవారు. పరమ నిరాడంబర జీవితాన్ని కొనసాగించిన ఆయన యుక్తవయసులోనే పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగసాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వమహర్షి అనుగ్రహం లభించిందని చెబుతారు. వెంకయ్య స్వామి బోధలు చాలు సులువైన భాషలో ఉండి లోతైన తత్వ్తాన్ని వివరిస్తాయి. ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా, అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో, ఒకరిని పొమ్మనేదాని కంటే మనమే పోవటం మంచిదయ్యా, సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా..సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప, అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు..నీవు దేవుడిని చూడగలవు కదయ్యా..ఇలా ఉండేవి ఆయన బోధనలు
శ్రీ వెంకయ్య స్వామి 1984 ఆగస్టు 24న అవతారం చాలించారు. సమాధి చెందేముందు మూడు మాటలు చెప్పారు. అవి సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. మానవులు మొదట దైవీసంపద సాధించాలి. అదే సంపన్నత్వం. దైవీసంపదలు అంటే భగవద్గీత ప్రకారం నిర్భయము, సాత్విక చిత్తశుద్ధి, జ్ఞానయోగములో స్థిరత, దానము, ఇంద్రియ నిగ్రహము, ఆత్మ విచారము, తపస్సు, అహింస, క్రోధము లేకపోవటము, ఇంద్రియ విషయములపై వ్యామోహం లేకపోవటము. ఇవి సాధించడమే సాధకుల లక్ష్యం. లేకపోతే విఫలం చెందుతారని భగవద్గీత హెచ్చరిస్తుంది. రెండవది సాధారణత్వం..అంటే దేవీ సంపద సాధించిన తర్వాత సాధకులకు గర్వం ఉండకూడదు. సాధించినవి అతనికి సాధారణమవ్వాలి. నేర్చినది హృదయంలో ధారణ చేస్తూ ఉండాలి. ఇక మూడవది సద్గురు సేవ..ప్రతి ఒక్కరికీ గురువు అనేవారుంటే ఎంతో గొప్ప మార్గంలో వెళ్లడానికి సాధ్యమవుతుంది. వెంకయ్యస్వామి సమాధి చెందిన గొలగమూడి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో ఆరాధనోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నవారిని సంతృప్తి పరచడానికే శ్రీ వెంకయ్య స్వామి అవతరించారు. ఆయన చూపిన మార్గంలో మానవాళి నడవాలి. ఎందుకంటే మోక్షాన్ని కలిగించే మార్గం ఇదే.





