News

మోటుపల్లి ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి

385views

బాపట్ల జిల్లాలోని మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్‌ జె వెంకట మురళి తెలిపారు.జిల్లాలోని మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో నిర్వహించారు. కాకతీయులనాటి అభయ శాసనాలను తెలుగులోకి అనువదిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధకులు, శాసనాల పరిశోధకుల ద్వారా ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రాచీన వైభవం తెచ్చేలా కోదందరామ ఆలయం అభివృద్ధి చేస్తామన్నారు. కోదండరామ దేవాలయానికి సమీపంలోని 5.8 ఎకరాల భూమిని ఆలయానికి కేటాయించాలన్నారు. ఆ భూమికి సంబంధించిన దస్త్రాలు, వివరాలను సీసీఎల్‌ఏకు నివేదించాలన్నారు. చినగంజాం మండలంలోని ఆ గ్రామంలో తుపాను షెల్టర్‌ ఎదురుగా ఉన్న 4.5 ఎకరాల ఖాళీ భూమిని విచారించాలన్నారు. సమీపంలోని 10.9 ఎకరాల భూమిని కోదండరామ స్వామి దేవాలయానికి కేటాయించే అంశంపై దృష్టి సారించాలన్నారు. 100 ఎకరాల పరిధిలోని బయోడైవర్సిటీ భూమిని పరిశీలించాలన్నారు. కాకతీయులు, చోళరాజుల నాటి శాసనాలు, పంచలోహాలను చిన్నగంజాంలోనే భద్రపరచడానికి మ్యూజియం నిర్మించాల్సి ఉందని కలెక్టర్‌ తెలిపారు. మ్యూజియం నిర్మాణంపై పురావస్తు శాఖకు సమగ్ర నివేదికతోపాటు లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాచీన సంపద ప్రస్తుతం హైదరాబాద్‌, చైన్నె, విజయవాడ మ్యూజియంలలో ఉందన్నారు. వాటిని తెప్పించడానికి దస్త్రాలను సిద్ధం చేయాలన్నారు. ప్రాచీన కాలం నాటి బుద్ధుడి విగ్రహాన్ని భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. డీఆర్వో జి గంగాధర్‌గౌడ్‌, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్‌, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ సూర్యప్రకాశరావు, శాసనాల పరిశోధకులు డాక్టర్‌ బి రమేష్‌చంద్రబాబు, ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ సాయిబాబు పాల్గొన్నారు.