
( ఫిబ్రవరి 24 – దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి )
భావ కవిత్వానికి బ్రహ్మ, రారాజు, ఆంధ్రా షెల్లీ అని కీర్తింపబడ్డ మహానుభావులు, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు జగద్విఖ్యాతం. 1897 నవంబరు 1న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపాలెంలో తమ్మన్నశాస్త్రి, సీతమ్మ దంపతులకు దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మించారు. ఆయనపై అనేక ఉద్యమాల ప్రభావం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో భాష, సంస్కృతి, సమాజం ఈ రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న కాలంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం పట్టారు. ఆనాటి సాహిత్యంలో ప్రధానమైన ధోరణి, ఉద్యమ స్థాయిని అందుకున్న కవితా పద్ధతి భావకవిత్వం. ఆ భావ కవిత్వ యుగంలోని అచ్చమైన భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రణయం, ప్రకృతి, దేశభక్తి, ఆధ్యాత్మికత, సంఘ సంస్కరణ, మానవత్వం, కాల్పనికత, మార్మికత ఇవన్నీ ఆనాటి భావకవుల ప్రధానమైన వస్తువులు. ఈ అంశాలన్నీ దేవులపల్లి కవిత్వంలో మనకు దర్శనం ఇస్తాయి.
దేవులపల్లి గీతాలలో దేశభక్తి గీతంగా ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం జయ జయ జయ ప్రియ భారత జనయత్రీ దివ్యధాత్రి. భారతదేశాన్ని తల్లిగా భావించి దేవులపల్లి వారు రాసిన ఈ గేయం జాతీయపండుగల సందర్భాల్లో తెలుగువాళ్ల నోట పారాయణంగా మ్రోగుతుంది. అయితే దేశభక్తి అనే ఛాయతోనే ఆంధ్రదేశాన్ని తల్లిగా ఆరాధిస్తూ ఆయన రచించిన మరొక గేయం జయ జయ ప్రియాంధ్ర జనయితీ..ఇది చాలామందికి అంతగా తెలియదు. ఈ పాటలో ఆంధ్రదేశాన్ని భారతధాత్రి ప్రియపుత్రీ అంటూ ఆ భరతమాత పుత్రికగా ఆంధ్రదేశాన్ని దేవులపల్లివారు ఊహించారు. ఈ పాట ముగింపులో జగమంతా తన కుటుంబమే అని నమ్మే విశాల హృదయాన్ని కవి కనబరిచారు. విశాల మానవతా సమతా వాదమే మన మనోరథం కావాలని, ఏ కులమతాలు, వైషమ్యాలు లేని సమానత్వంతో మానవత్వాన్ని సాధించి మనుషులంతా ఒకే కుటుంబంగా జీవించే ఆశయాన్ని సాధించాలని అందుకోసం నడుం కట్టాలని దేవులపల్లిగారు ప్రబోధించారు. లోక కల్యాణం కోసం భావితరాల సౌభ్రాతృత్వం కోసం, స్వేచ్ఛ కోసం దృఢమైన శపథం తీసుకోవాలని బోధించారు. ఒక్క క్షణకాలం కూడా వృథా చేయకుండా ఈ ఆశయసాధన కోసం అంకితం అవుతామని, గమ్యం కోసం సాగే ప్రయాణంలో తమ అడుగులు చెదరవని సంకల్పాన్ని దేవులపల్లివారు ఈ గేయంలో వెల్లడించారు. ఇటువంటి మహదాశయంతో సాగిపోయే తమను తల్లిగా ఆశీర్వదించమని శుభము, శాంతి కలగాలని దీవించమని కోరారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు కేవలం తన రాతల ద్వారా దేశం పై తన అనురక్తిని చాటుకోలేదు. తన చేతల ద్వారా కూడా దేశం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. బ్రహ్మ సమాజంలోనూ, నవ్య సాహితీసమితిలోనూ సభ్యునిగా భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. సమాజం పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. అందుకే, హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంధువులు ఆయన్ను వెలివేసినా వెనుకాడకుండా వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. దేవుడు గుడిలో ఎక్కడో కొలువు ఉండడు, జనం మధ్యలో తిరుగుతుంటాడు, ముఖ్యంగా దీనజనుల మధ్య ఉంటాడని తెలుపుతూ “ఈ సుధర్మభవనములో ఈరేడు జగాలనేలు ఈశ్వరుడే దినజన హృదీశ్వరుడే కొలువుదీర్చు..” అని తన గీతం ద్వారా సమాజాన్ని మేల్కొలిపారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ, 1978లో సాహిత్య అకాడమీ అవార్డు, 1976లో పద్మభూషణ్ దేవులపల్లిని వరించాయి. 1964లో గొంతు క్యాన్సర్ బారిన పడడంతో ఆయన స్వరపేటికను తొలిగించారు. మూగబోయిన కంఠంతోనే అనేక సినిమాలకు పాటలు, ఆకాశవాణికి లలిత గీతాలు రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 1980 ఫిబ్రవరి 24న కన్నుమూశారు. వారు భౌతికంగా లేకపోయినా, వారి గేయ రచనా కౌశలం మనందరి చెవుల్లో, గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ మేటి సాహితీ దురంధరుడి ఆకాంక్ష అయిన “వసుధైక కుటుంబం” సాధన దిశగా అడుగులు వేద్దాం..అదే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారికి మనం అందించే గొప్ప నివాళి.





