ArticlesNews

ఆరోగ్యవంతునికి కల్పవృక్షాలు-రోగికి విషవృక్షాలు

248views

రామ కథా రచనకు వాల్మీకికి ప్రేరణ క్రౌంచ మిథున వియోగం. దాంపత్య జీవితం సాగించే ఆ పక్షి జంటలో ఒక పిట్టను నిషాదుడు కొట్టగా రెండవది విలవిల విలపించినది. తమసానది స్నానానికి వెడుతున్న వాల్మీకి మునిచంద్రుని చెవిన బడినది, ఆ విలాపం. దానితో ఆయన గుండె ద్రవించి శోకించింది. ఆ శోకమే శ్లోకమయినది, ప్రపంచ సాహిత్యంలోనే అది మొదటి కావ్యానికి మహాకావ్యానికి అంకురార్పణ అయింది. ఇది రామాయణ రచనకు ప్రేరణ; అదీ భారతీయ కవి ఆత్మ.

భారత రామాయణాలు ఆరోగ్యవంతునికి కల్పవృక్షాలు-రోగికి విషవృక్షాలు, చెట్టుకొమ్మ మీది పిట్ట ఆర్తనాదాన్ని సహించలేని అతనిలో దయా హృదయం రామాయణ రచనకు ఉపక్రమించింది. అంటే రాజుల విలాస భోగాల కోసం, రాణుల అంగాంగ వర్ణన కోసం ఈ దేశంలో కావ్యం పుట్టలేదని తేలుతుంది.

అందువల్లనే దేశదేశాల మేధావులను ఆకర్షిం చింది, అలరించింది, నేటికి ఆ అలరింపూ, ఆకర్షణా ఉన్నాయి. అయితే దేవుడు పుట్టిన కృతయుగం నాటి నుండి దేవుడి మీద పగబూనిన హిరణ్యాక్ష, హిరణ్య కశిప, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్రాదుల వలెనే రామాయణం మీద కూడా విద్వేషం ప్రజ్వ లింపజేసుకునేవారు పుడుతూనే ఉన్నారు. భారత, రామాయణాలు రెండూ తగుల బెట్టాలనే వారు ఉన్నా, భారతం కంటే రామాయణం అంటేనే వీరికి భయం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. భారతంలో ఉన్నంతగా మానవునిలోని పిశాచవృత్తి, దారుణకామ పాశం, అత్యంత ధనకాంక్ష రామాయణంలో లేకపోవ డమే వీరి భయానికి హేతువుగా భావించవచ్చు. మనిషిని పశువుగా కాక పశుపతిగా (పరమ శివునిగా) పరివర్తింపజేయడానికే రామాయణం సాగడం వీరి గుండెకు దెబ్బతీసి ఉంటుంది. దశరథుడనే రాజు కొడుకు రాముడు. తండ్రిమాట విని సర్వసుఖభోగాలూ విడవడం, తనమీద భారం ఉంచి తనతో పంపిన జనక మహారాజు కూతురు కోసం భర్తగా-నానాయాతనలూ పడడం వీరికి నచ్చలేదు. సత్యధర్మపరాయణులయిన మునులను హింసించే క్రూరకర్ములయిన రాక్షనగణాలను రూపుమాపడమూ వీరికి గిట్టలేదు.

అన్ని గిట్టకపోగా,వీరి వాదంలో ఒక చమత్కారం ఉంది. దశరథుడున్నాడు. ఆయనకు భార్యలూ, బిడ్డలూ ఉన్నారు. మంధర ఉంది. శూర్పణఖ అనే అమ్మాయికి రాముని తమ్ముడు ముక్కు చెవులు కోశాడు. ఇలా ఇవన్నీ ఉన్నాయి కాని కొన్ని కొన్ని ఘట్టాలు మాత్రం కల్పనలు. అవి తమకు కిట్టనివి; గిట్టనివి! తమ వాదానికి గిట్టుబాటు కానివో!

రాముడనే వాడొకడున్నాడని చెప్పిన వాల్మీకి కంటే ఆ రాముని గూర్చి వీరికే బాగుగా తెలుసు. అదీ వీరి యోచనా స్రవంతి సాగించిన ప్రదక్షిణ. దేవుడు లేడు అంటే భారత, రామాయణాలు కూడా లేవు అని తమ వ్యాపారం తాము చేసుకొనవచ్చు. కాని అందుకు రాముని తిట్టాలి. వాల్మీకిని దుమ్ములో ముంచాలి. రామాయణం చదివే వారిని నేలబెట్టాలి. వీరి కోపమంతా రామాయణం చదివేవారిపైనా, భారతం వినేవారిపైన.

భారత, రామాయణ శ్రవణ మనన పరాయణు లైన నిందించే ఈ వివేకులు ప్రజాభిప్రాయాన్ని మన్నించడానికి దీక్షాకంకణం ధరించిన మహ నీయులు. వీరి మానసవీధిని పుట్టినదే ప్రజాభి ప్రాయం. దానికి వారు గుత్తాధిపతులు, ఈ ఆధిపత్య ప్రతిష్టాపనకు వారు వాల్మీకి నుండి వర్తమాన రామకథా శ్రవణాసక్తుని కూడా దుర్భాషలాడగలరు. అది వారి దృష్టిలో హేతువాదం. అదే మానవతా వాదము, నీడనిస్తూ, చక్కని వాతావరణం అనుగ్రహించే మహా వృక్షాలను సమూలముగా పెకలించి, పువ్వూ-పండూ లేని క్రోటను మొక్కలంటే ప్రీతిగల వారిని మనం ఏమనగలం. ఏమన్నా వారు మీద పడతారు. వీరి సంఖ్య సమాజంలో ఒకటి, రెండే కానీ వీరు ఆడేది పదుగురాడు మాట, వీరు పాడినది పదిమంది పాడవలసిన పాట. మనం ఆడము, పాడము,

– పురాణపండ