News

జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

563views

మ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్‌నాగ్‌ జిల్లా శివారులోని బిజ్‌బెహరా ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. బుధవారం ఉదయం భద్రతా బలగాలకు ముష్కరులు ఎదురుపడ్డారు. తొలుత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. వాటిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రమూకలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటిని చుట్టిన ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు కొనసాగిన నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మొబైల్‌, అంతర్జాల సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

అంతకుముందు గాందర్బల్‌ అడవుల్లో తలదాచుకుంటున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రోజులుగా భద్రతా సిబ్బంది వీరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి తూట్లు పొడిచిన విషయం తెలిసిందే. దీంతో ఉరి సెక్టారులో ఓ సైనికుడు, షాపుర్‌ సెక్టార్‌లో షమీమా అక్తర్‌(24) అనే మహిళ మృతిచెందారు. భారత భూభాగంలోకి అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో పహారా కాస్తుండగా మందుపాతర పేలి జవాను ఒకరు మృతిచెందారు. మరో సిపాయి తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.