News

ఇదీ.. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం

250views

ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఏపీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు గుర్తుచేసింది. 2024-25 బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు, వాటి అమలు స్థితిని వివరించింది.

గత బడ్జెట్‌లో ప్రకటన: ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. రాజధాని నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.15 వేల కోట్లు సమకూర్చడంతోపాటు భవిష్యత్తులో అదనపు నిధులు అందిస్తాం.

అమలు: ‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం’ కింద మూలధన వ్యయంగా రూ.3,950.31 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. 2024 డిసెంబరు 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేశారు.

2015 జూన్‌ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆర్థిక సాయం (గ్రాంట్‌) కింద రూ.35,491.57 కోట్లు విడుదలయ్యాయి.

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రాజధాని అమరావతికి సుమారు రూ.13 వేల కోట్ల ఆర్థిక సాయం. రుణ మంజూరుకు చట్టపరమైన ఒప్పందాలు జరిగాయి.

గత బడ్జెట్‌లో ప్రకటన: పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, త్వరితగతిన పూర్తి చేయించడం.

అమలు: పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,807.69 కోట్లు విడుదల.

గత బడ్జెట్‌లో ప్రకటన: విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పరిధిలో కొప్పర్తి, హైదరాబాద్‌- బెంగళూరు నడవా పరిధిలో ఓర్వకల్లు వద్ద నీరు, విద్యుత్, రైల్వే, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు.

అమలు: గతేడాది ఆగస్టు 28న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. కొప్పర్తిలో రూ.2,136.51 కోట్లు (భూమి విలువతో కలిపి), ఓర్వకల్లులో రూ.2,786.10 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కొప్పర్తి, ఓర్వకల్లు పరిధిలో మూడు రహదారి, రెండు రైల్వే ప్రాజెక్టులను గుర్తించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడ ప్రాంతంలో వెల్దుర్తి నుంచి హుస్సేనాపురం, శోలాపుర్‌ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఆత్మకూరు రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరికొన్ని రోడ్ల పనులు జరుగుతున్నాయి.

గత బడ్జెట్‌లో ప్రకటన: ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు.

అమలు: ఏడు వెనకబడిన జిల్లాల (ఉమ్మడి)కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.1,750 కోట్లు విడుదలయ్యాయి. గత రెండు విడతల్లో రాష్ట్రానికి కేటాయించిన రూ.700 కోట్లకు వినియోగ పత్రాలు అందిస్తే, మరో రూ.350 కోట్లు కేటాయిస్తారు.

గత బడ్జెట్‌లో ప్రకటన: పూర్వోదయ పథకం కింద తీర ప్రాంత అభివృద్ధి.

అమలు: తూర్పు తీరంలోని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా సలహా కమిటీ ఏర్పాటు చేశారు. విజన్‌ ప్రణాళికలు రూపొందించారు. 45 జిల్లాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జలవనరులు, మౌలిక సౌకర్యాల కల్పన తదితర రంగాలకు సంబంధించి 49 పనితీరు సూచికలు రూపొందించారు. 168 ఆకాంక్షిత బ్లాక్‌ల పరిధిలో అమలు చేస్తున్నారు.