News

విశాఖ స్టీల్‌కు రూ.11,917 కోట్లు

246views

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చేసిన కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా పెంచింది. 2024-25 బడ్జెట్‌లో తొలుత కేవలం రూ.620 కోట్లు కేటాయించిన ఉక్కుశాఖ తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.8,622 కోట్లకు పెంచింది. అదే విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,295 కోట్లు కేటాయించింది. దీని ప్రకారం ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,917 కోట్లు ఇచ్చినట్లయింది. ఇందులో రూ.11,418 కోట్లు బడ్జెట్‌ సపోర్ట్‌ రూపంలో, రూ.499 కోట్లు అంతర్గత బడ్జెటరీ వనరుల ద్వారా సమకూరుస్తారు. ఇది ఇటీవల ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీకంటే ఎక్కువ. ఈ ప్లాంట్‌కు 2023-24లో కేటాయించిన రూ.636.46 కోట్లను పూర్తిగా ఖర్చు చేసింది. ప్లాంట్‌కు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాలను కేంద్ర ఆర్థికశాఖ ఈక్విటీ షేర్‌గా పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అమల్లోకి వచ్చినట్లయింది.