
శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్యనమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు హాజరయ్యారు. సుమారు 4వేల మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా సూర్యదేవాలయం వద్ద రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలోని డచ్ భవనం వద్ద హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత రుసుంపై 8 నిమిషాలపాటు హెలికాప్టర్‌లో తిరిగే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు. హెలికాప్టర్ రైడ్ కోసం పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. హెలికాప్టర్ రైడ్, ఇతర ఏర్పాట్లను రామ్మోహన్‌నాయుడు పరిశీలించారు. సాయంత్రం లేజర్ షోతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.





