
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేశారు. కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు. మీడియాతో ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. 20 రోజుల్లో మహా కుంభమేళాకు వచ్చిన జనం అమెరికా సంయుక్త రాష్ట్రాల జనాభాతో దాదాపుగా సమానమని తెలిస్తే ప్రపంచం నివ్వెరపోతుందని అన్నారు. ‘‘ఇది చరిత్రాత్మకం. ఇప్పటివరకు ఇంతమంది ప్రజలు భూమి మీద ఎక్కడా ఒకచోటుకు చేరలేదు. అధికార యంత్రాంగం గొప్పగా పనిచేస్తోంది. భారత్‌లో ఇటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తామని నేనైతే ఊహించనైనా లేదు. తొక్కిసలాట వంటి విషాద ఘటన జరిగినా, సమర్థవంతంగా అన్నీ చక్కదిద్దారు. అంకితభావం, సామర్థ్యం, సాంస్కృతిక విజ్ఞానం, జాతికి సేవ చేయాలన్న తపన ఉంటే అద్భుతాలు జరుగుతాయని యోగీజీ నిరూపించారు’’ అంటూ ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి హెలికాప్టరులో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకొన్న ధన్‌ఖడ్ దంపతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అరైల్ ఘాటు వద్ద అందరూ క్రూయిజ్ బోటు ఎక్కి త్రివేణీసంగమానికి చేరుకున్నారు. పూజారుల మంత్రోచ్చారణల నడుమ తలపై శివలింగం పెట్టుకొని ధన్‌ఖడ్ పుణ్యస్నానం చేశారు.





