News

ఖలిస్థాన్‌ కు మద్దతు పలుకుతున్నవారు పాకిస్థాన్ ఏజెంట్లే – హర్షవర్ధన్

472views

లిస్థాన్‌ కోసం ‘రెఫరెండం 2020’ పేరిట జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఒక పెద్ద బోగస్‌ వ్యవహారమని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లా అన్నారు. దీనికి ఆ వర్గంలోని కొంతమంది మాత్రమే మద్దతు పలుకుతున్నారన్నారు. ‘రెఫరెండం 2020’ పై ఓ దౌత్యాధికారి బహిరంగంగా స్పందించడం ఇదే తొలిసారి. ఖలిస్థాన్‌ ఒక ముగిసిన అంశమని ఇంకా దానికోసం వాదిస్తూ కొంత మంది ఉగ్రవాద చర్యలకు సైతం పూనుకుంటున్నారని తెలిపారు. ఇది ఏ మాత్రం సమంజసం కాదన్నారు. దీనికి మద్దతు పలుకుతున్న వారిని పాకిస్థాన్‌ ఏజెంట్లుగా ష్రింగ్లా అభివర్ణించారు. భారత్‌లో వేర్పాటువాదానికి పాకిస్థాన్‌ మద్దతు పలుకుతోందన్నారు. అమెరికాలోని సిక్కులు నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, భారత్‌ మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడంలో సిక్కు వర్గం కీలకంగా వ్యవహరిస్తోందని ష్రింగ్లా తెలిపారు. సిక్కుల్లో అత్యధికులు భారత్‌కు మద్దతుగా ఉన్నారని.. వారికి ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వేర్పాటువాదం పేరుతో దేశంలో అలజడులు సృష్టించాలనుకుంటున్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. నవంబర్‌ 12న గురునానక్‌ దేవ్‌ 550వ జయంతిని జరిపేందుకు భారత దౌత్య కార్యాలయం ఘనంగా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అక్కడి సిక్కుల నేత జస్సీ సింగ్‌ మాట్లాడుతూ.. ‘రెఫరెండం 2020’కి మెజారిటీ వర్గాల మద్దతు లేదని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే భారత ప్రభుత్వంతో చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.