
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. అలాంటి కర్మభూమిలో గోవుకు ఎంతో విశిష్ట స్థానం వుంది. గోవును కామధేనువుగా పూజించడం మన సంప్రదాయం. గోమాతలో సకల దేవతా రూపాలుంటాయని, ముఖ్యంగా లక్ష్మీ స్వరూపం వుంటుందని మన నమ్మకం. గోపూజ, గోదానం, గోసేవ ఎంతో పవిత్రమైనది. కనుకనే గీతాచార్యుడు శ్రీకృష్ణుడంతటి వాడే గో సేవలో తరించాడు. అందుకే గోవును అత్యంత పవిత్రంగా పూజించుకుంటాం. పూజాదికైంకర్యాలు, ఆచార వ్యవహారాల్లో సైతం గోమయం, గోపంచకం కూడా వాడే సంప్రదాయం మన దేశంలో వుంది. గోమాతను పూజించడం, సేవించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయనేది హిందువుల అపార విశ్వాసం. గోవు ఇంటికి వచ్చిందంటే చాలు, భక్తితో పూజించుకుంటాం. ఆతిథ్యమిస్తాం.
అలాంటి ఓ గోవు ఓ వస్త్ర దుకాణానికి అనుకోని అతిథిలా వస్తుంటుంది. ఆ షాపులోనే కాసేపు సేద దీరుతుంది. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులోని సాయిరామ్ వస్త్ర దుకాణంలో చోటు చేసుకుంది. ఏకంగా ఆరేడు నెలల నుంచి ప్రతిరోజూ ఆ గోమాత క్రమం తప్పకుండా అదే షాపుకే వెళుతుండడం విశేషం. చుట్టుపక్కల ఎన్ని షాపులున్నా, గోమాత మాత్రం అదే షాపుకి వెళ్ళి మెత్తని పరుపుల మీద సేద తీరుతుండడం స్థానికులకే కాదు, కొనుగోలుదారులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. గోమాత వచ్చినప్పుడు దుకాణ యజమాని సపర్యలు చేస్తూ, ఆతిథ్యం ఇస్తూ భక్తిని చాటుకుంటున్నాడు. గోమాత షాపుకి రావడం తన అదృష్టంగా భావిస్తుంటాడు. గోసేవ చేసుకోవడం తన భాగ్యమని పొంగిపోతుంటాడు.





