
ఉగ్రవాదులను దెబ్బకొట్టాలంటే దాని సిద్ధాంతాలను రూపుమాపాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్అన్నారు. సోమవారం ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ
“ఉగ్రవాదం కొత్త అంశమేం కాదు. ఉగ్రవాద సిద్ధాంతాలను నియంత్రించకుండా ఉగ్రవాదాన్ని రూపుమాపలేం. ఉగ్రమూలాలపై దెబ్బకొట్టగలిగితే దాన్ని జయించినట్లే. ఒక నేరగాడికి రాష్ట్రం లేదా దేశం అండగా నిలబడితే అది ఖచ్చితంగా సవాలుగా మారుతుంది. ఉగ్రవాదులకు అండ విషయంలో కొన్ని దేశాలు ఆరితేరాయి. ఉదాహరణకు ఇప్పుడు పాకిస్థాన్ చేస్తోంది కూడా అదే. ఆ దేశం అండ లేకపోతే ఉగ్రవాదం ఎప్పుడో అంతమైపోయేది. పాక్ వారికి ఆర్థిక సాయం చేయకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. ఆర్థిక చర్యల కార్యదళం సిఫార్సులను కూడా ఆ దేశం పెడచెవిన పెట్టింది. అందుకే ఉగ్రవాదం మీద పోరాటం మాత్రమే సరిపోదు. వారికి నిధులు సమకూర్చడాన్ని కూడా అడ్డుకోవాలి” అని దోవల్ తెలిపారు.





