News

భారతదేశంలోని మైనార్టీలు ఇండోనేసియా బాటలో నడవాలి

280views

ఇండోనేసియా ముస్లిం మెజార్టీ దేశమైనప్పటికీ తన భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తోందని, ఇక్కడున్న మైనార్టీలు సైతం అదే బాటలో నడవాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభిప్రాయపడ్డారు.లక్నోలో టైమ్స్‌ నౌ – నవభారత్‌ ఏర్పాటుచేసిన ‘‘మహాకుంభ్‌ సమాగమ్‌’’ సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఇటీవల త్రివేణీసంగమంలో పుణ్యస్నానం చేయడంపై స్పందిస్తూ.. బుజ్జగింపు రాజకీయాలతో అపఖ్యాతి పాలైన నేతలు సైతం త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేయడం సనాతన ధర్మం శక్తికి నిదర్శనమని అభివర్ణించారు. మహాకుంభ మేళా ముగిసే ఫిబ్రవరి 26 నాటికి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే భక్తుల సంఖ్య ప్రపంచంలో జనాభాపరంగా మూడో అతిపెద్ద దేశాన్ని అధిగమిస్తుందన్నారు. పొరుగు దేశాల మైనారిటీల ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలుచేసినట్లే వక్ఫ్‌ చట్ట సవరణ కూడా జరిగి తీరుతుందని యోగి అన్నారు.
హిందువులను అవమానించిన ఖర్గే: భాజపా

ముంబై : ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమంలో పుణ్యస్నానాలు చేసిన కాషాయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మహారాష్ట్ర బిజెపి చీఫ్‌ చంద్రశేఖర్‌ బావన్‌కులే ‘ఎక్స్‌’ ద్వారా ఆక్షేపణ తెలిపారు.