News

షరియా నుంచి మినహాయింపు ఇవ్వండి : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముస్లిం మహిళ

280views

తనను ఇస్లామిక్‌ ధార్మిక న్యాయశాస్త్రం షరియా నుంచి మినహాయించి భారతీయ వారసత్వ చట్టం పరిధిలోకి తేవాలంటూ కేరళకు చెందిన ఓ ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అభ్యర్థనపై తన విధానాన్ని తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ‘‘ఎక్స్‌ ముస్లిమ్స్‌ ఆఫ్‌ కేరళ’’ అనే సంస్థ ప్రధాన కార్యదర్శి సఫియా పి.ఎం. దాఖలు చేసిన పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై సమాధానం తెలపడానికి కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఈ పిటిషన్‌ ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ‘‘పిటిషన్‌ దాఖలు చేసిన మహిళ జన్మతః ముస్లిం. ఆమెకు షరియా పట్ల విశ్వాసం లేదు. అదో తిరోగామి న్యాయమని ఆమె నమ్మకం’’ అని ఆయన తెలిపారు. ‘‘ఇది ఒక మతవర్గం మొత్తానికి సంబంధించిన విషయం. దీనిపై మీరు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలి’’ అని ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది.