
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు సమీపంలోని కొండపై వెలసిన రంగనాధ్వసామి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుప్త నిధుల ముఠాలు ఆలయాన్ని ధ్వంసం చేసిన విషయంపై తిరుపతి పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.శివకుమార్ స్పందించారు. ఇటివల ఆయన కొండపైకి వెళ్లి నేలమట్టమైన ఆలయాన్ని సందర్శించి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రకు సాక్ష్యమైన ఆలయాన్ని ధ్వంసం చేయడం దారుణమైన విషయమని అన్నారు. గర్భగుడి, ఆలయం మొత్తం పడిపోవడంతో వాటినైనా పునరుద్ధరించి ఇక్కడి చరిత్ర శిథిలం కాకుండా చూడాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. శివకుమార్ మాట్లాడుతూ ఆలయం ఉన్నస్థితి చూసి బాధ కలిగిందన్నారు. ఆలయాల్లోని రాళ్లలో, గర్భగుడిలో ఎలాంటి నిధులు, నిక్షేపాలు ఉండవని స్పష్టం చేశారు. గుప్త నిధుల ముఠాలు దీనిపై అపోహతో వాటిని ధ్వంసం చేస్తూ చరిత్రకు సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికై న గుప్త నిధుల ముఠాలు దీన్ని గుర్తించి ఆలయాల జోలికి వెళ్లవద్దని కోరారు. రంగనాధస్వామి ఆలయ పునరుద్దరణ కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. తొలుత ఇంజనీర్లను పంపి ఆలయాన్ని పరిశీలింపజేయాలని కోరినట్టు చెప్పారు.





