
కశ్మీర్లో చొరబడడం వీలు కాకపోవడంతో ఖలిస్తాన్ ఉగ్రబృందాలను అడ్డం పెట్టుకుని భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాక్ కుట్ర చేస్తుందా?ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పంజాబ్ పోలీసులు మరో పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇందుకు సంబంధించిన కుట్రను చేధించారు పంజాబ్ పోలీసులు. డ్రోన్ల సాయంతో పంపిన ఏకే 47 తుపాకులను, పేలుడు పదార్థాలను, శాటిలైట్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ చెందిన మద్దతుదారులకు ఈ ఆయుధాలను చేరవేశారని సమాచారం. వీటి ద్వారా పంజాబ్ తో పాటు దేశంలోని పలుప్రాంతాల్లో దాడులకు పాల్పడాలనేది ఉగ్రవాదుల ప్లాన్ గా పోలీసులు తేల్చారు. అయితే ఆ కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. నలుగురు టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేశారు. అలాగే తరన్ తరన్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో ఐదు ఏకే 47 తుపాకులు, పేలుడు పదార్థాలు, పిస్టల్స్, శాటిలైట్ ఫోన్స్, హ్యాండ్ గ్రెనైడ్లు, 500 రౌండ్ల బుల్లెట్లు, 10 లక్షల నగదు ఉన్నాయి. నిషేధిత ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్‌కు పాక్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది. ఆర్టికల్ 370 తర్వాత నిఘాను కట్టుదిట్టం చేయడం వల్లే ఉగ్ర కుట్రలు సాగలేదని అంటున్నారు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్త. ఉగ్రవాదులు వైట్ కలర్ మారుతీ స్విఫ్ట్ కారులో ఈ ఆయుధాలను తీసుకెళ్తున్నారు. కాగా, ఉగ్రవాద లింకులు ఉండటంతో ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు.

Source : Enadu





