News

మహాబలిపురం… మహాబలిపురం… మహాబలిపురం…

556views

పల్లవుల నగరంలో పల్లవించిన స్నేహం

 

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ , ప్రధాని నరేంద్రమోదీ మహాబలిపురం పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మహాబలిపురం చేరుకున్న ఇరుదేశాధినేతలు పలుచారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వస్త్రాలను ధరించారు. మహాబలిపురంలోని పలు చారిత్రక కట్టడాలను వీక్షిస్తూ ఇరువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. చారిత్రక కట్టడాల విశిష్టత, శిల్ప కళా సౌందర్యాన్ని జిన్‌పింగ్‌కు మోడీ వివరించారు. పరమశివుడి నుంచి అర్జునుడు పాశుపతాస్త్రం పొందే శిల్పాన్ని , కృష్ణుడి వెన్నముద్ద శిలను, ఏకశిలాకట్టడాలైన పంచరథాలు, ఇతర విగ్రహాలను ఇరువురు నేతలు సందర్శించారు. వెయ్యేళ్ల క్రితం వీటిని నిర్మించిన పల్లవరాజుల గొప్పదనాన్ని జిన్‌పింగ్‌కు మోడీ వివరించారు. ఆలయ ప్రాంగణంలోనే కొబ్బరి బోండాలు సేవిస్తూ పలు అంశాలపై ఇరువురూ మాట్లాడుకున్నారు.అనంతరం మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాప్రదర్శనలను మోడీ, జిన్‌పింగ్‌ వీక్షించారు. చెన్నైకి చెందిన కళాక్షేత్ర విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. జిన్‌పింగ్‌ గౌరవార్థం రాత్రికి మోడీ విందు ఇచ్చారు.

అంతకుముందు బీజింగ్‌ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న షీ జిన్‌పింగ్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అభివాదం చేస్తూ విమానం నుంచి దిగిన చైనా అధ్యక్షుడికి తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర ప్రభుత్వ అధికారులు స్వాగతంపలికారు. వారందరితో జిన్‌పింగ్‌ కరచాలనం చేశారు. తమిళ సంప్రదాయం ప్రకారం జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను జిన్‌పింగ్‌ ఆసక్తిగా తిలకించారు. అనంతరం గిండిలోని హోటల్‌కు జిన్‌పింగ్‌ వెళ్లారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం మహాబలిపురం విచ్చేశారు.

సాగరతీరాన ప్రధాని మోడీ స్వచ్ఛభారత్‌

“పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష” అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛభారత్‌’కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛభారత్‌ చేపట్టి మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మోడీ. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఉదయం స్థానిక బీచ్‌కు వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త కన్పించడంతో స్వయంగా స్వచ్ఛభారత్‌ చేపట్టారు. బీచ్‌లో చెత్తను తొలగించారు.

శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోడీ అక్కడి బీచ్‌లో స్వచ్ఛభారత్‌ చేపట్టారు. బీచ్‌లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్‌ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్‌కు జాగింగ్‌ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అని మోడీ పేర్కొన్నారు.

మోడీ, జిన్‌పింగ్‌ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రెండో రోజు భేటీ అయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో నిన్న ఇష్టాగోష్ఠి జరిపిన వీరిద్దరూ శనివారం కోవలంలో సమావేశమయ్యారు. ఈ ఉదయం కోవలంలోని తాజ్‌ ఫిషర్‌మ్యాన్స్‌ కోవ్‌ హోటల్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ బ్యాటరీ కారులో ప్రయాణించి సమావేశ గదికి చేరుకున్నారు. నిర్దిష్ట ఎజెండా, అధికార లాంఛనాలు లేకుండా కులాసా వాతావరణంలో మోడీ, జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మన బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది – ఇరు దేశాధినేతలు

భారత్‌-చైనా సత్సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని కోవలం వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో నేడు జరిగిన ఇష్టాగోష్ఠి అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అనంతరం ప్రతినిధుల బృందం స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మోడీ, జిన్‌పింగ్‌ తమ భేటీపై అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు.

విభేదాలు పెరగకుండా చూసుకుంటాం: మోడీ

”చెన్నై కనెక్ట్‌’ భేటీతో భారత్‌-చైనా బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. వూహాన్‌లో జరిగిన తొలి భేటీనే ఇందుకు స్ఫూర్తి. చైనా, తమిళనాడు మధ్య బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఆర్థికంగా మన రెండు దేశాలు శక్తిమంతమైనవి. ఇరు దేశాల మధ్య విభేదాలు పెరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. మన సంబంధాలు, సమస్యలపై సున్నితంగా ఉందాం. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం కోసం మనవంతు సహకారం అందిద్దాం’ అని మోడీ చెప్పుకొచ్చారు.

మీ ఆతిథ్యంతో మైమరచిపోయాం: జిన్‌పింగ్‌

‘ఈ పర్యటన నేను ఎప్పటికీ మరువలేను. మీ ఆతిథ్యం మమ్మల్ని మైమరచిపోయేలా చేసింది. నాకు, నా సిబ్బందికి ఈ పర్యటన ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మోడీజీ మీరన్నట్లుగానే మన మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయి’ అని జిన్‌పింగ్‌ కొనియాడారు.

ఈ చర్చల అనంతం కోవలం రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్తువులు, కళాఖండాల ప్రదర్శనను మోడీ, జిన్‌పింగ్‌ సందర్శించారు. విందు భేటీలో మరోసారి చర్చలు జరిపిన అనంతరం జిన్‌పింగ్‌ తిరుగు పయనమవనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.