News

సిమెంటుకు హలాల్ ధ్రువీకరణ అవసరమా : సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్

50views

ఇనప కడ్డీలు, సిమెంట్ వంటి ఉత్పత్తులకు హలాల్ ధ్రువీకరణ అవసరమా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్న లేవనెత్తారు. ఉత్తరప్రదేశ్ లో హలాల్ ధ్రువీకరణ కలిగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. “మాంస ఉత్పత్తులకు హలాల్ ధ్రువీకరణ ఉండాలి అన్న వాదనపై ఎవరికీ అభ్యంతరం లేదు. సిమెంటు, ఇనప కడ్డీలు కూడా ఇలాంటి ధ్రువీకరణ పొందాల్సి రావడమే విచిత్రం’ అని తుషార్ మెహతా అన్నారు. హలాల్ ధ్రువీకరణ జారీ చేసే సంస్థలు పెద్దమొత్తాల్లో రుసుము వసూలు చేస్తున్నాయని, ఈ మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. “గోధుమ పిండి, శెనగపిండి వంటి వస్తువులకూ హలాల్ ధ్రువీకరణ అవసరమా?” అని ఆయన ప్రశ్నించారు. అయితే హలాల్ ధ్రువీకరణ పత్రం పొందడం స్వచ్ఛంద వ్యవహారమేనని, దాన్ని తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని, పిటిషనర్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మరోవైపు.. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణను మార్చి 24 తరువాత చేపడతామని స్పష్టంచేసింది.