NewsProgramms

ఆరెస్సెస్ శిక్షణా తరగతుల ముగింపు ఉత్సవాల ముఖ్య అతిథిగా శ్రీ చంద్రబాబు

963views

నీవు చేసే పని రైల్వే క్రాసింగ్ పక్కన చెత్త ఊడవటమే కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏ రైల్వే క్రాసింగ్ నీ క్రాసింగ్ అంత చక్కగా, పరిశుభ్రంగా ఉండదు అనిపించేలా ఆ పని చెయ్యి” అన్నారు శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య. అలా అన్నారని చెప్పుకోవటమే గాని నిజంగా అంత చక్కగా తమ కర్తవ్యం నిర్వహించే వారిని ఎవరూ గుర్తించరు. కానీ RSS తిరుపతి జిల్లా శాఖవారు ఆ పని చేశారు.

 ప్రతి ఏడాదీ RSS లో వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు దేశంలోని అన్ని జిల్లాలలోనూ జరుగుతాయి. వీటిని “ప్రాథమిక శిక్షావర్గ”లంటారు. 14 సంవత్సరాలు నిండిన వారి నుంచి 40 ఏండ్ల వయసున్న వారి వరకు ప్రాథమిక శిక్షావర్గలో శిక్షణ పొందటానికి అర్హులు. ఈ శిక్షా వర్గలలో యోగా, ధ్యానం, కర్రసాము, వివిధ రకాల ఆటలు వంటి శారీరక కార్యక్రమాలలో శిక్షణ ఇస్తారు. అలాగే మన దేశ నాయకుల, మహనీయుల గాథలు, చారిత్రక వాస్తవాలు, సమకాలీన పరిస్థితులపై చర్చ వంటి కార్యక్రమాలు అత్యంత క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో జరుగుతాయి.  సేవా కార్యక్రమాలలో కూడా శిక్షణ ఇస్తారు.

సహజంగా ఆ శిక్షావర్గల ముగింపు కార్యక్రమాలకు ఆయా నగరాలు, పట్టణాలలోని ప్రతిష్టిత వ్యక్తులను ఆహ్వానించడం రివాజు.  అయితే ఈసారి తిరుపతి కార్యకర్తలకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. పైన చెప్పినట్లుగా తాను చేసే వీధులూడ్చే పనిని త్రికరణ శుద్ధిగా చేసే నగరి మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు శ్రీ P. చంద్రబాబు స్థానిక ఆరెస్సెస్ కార్యకర్తల దృష్టిని ఆకర్షించాడు. ఆయనను గుర్తించి గౌరవించాలని భావించారు. ఆలోచన వచ్చిందే తడవుగా వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరిగే ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ p. చంద్రబాబు గారిని ఆహ్వానించారు.

ఎప్పుడూ తన పనిలో మన స్ఫూర్తిగా నిమగ్నమై, పనినే దైవంగా భావించి పనిచేస్తూ ఆ ప్రాంత ప్రజలందరి మన్నన పొందిన వ్యక్తి శ్రీ చంద్రబాబు. వారిని వారం రోజుల శిక్షావర్గలో శిక్షణ పొందుతున్న యువకులకు రోల్ మోడల్ గా చూపించటం ద్వారా వారిలో స్ఫూర్తి నింపారు RSS తిరుపతి శాఖవారు. ఒకవైపు “స్వచ్ఛభారత్“ కార్యక్రమం దేశమంతటా అనేక మందిని స్వచ్ఛత వైపు ఆలోచింపజేస్తున్న ఈ తరుణంలో తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి అనునిత్యం సమాజం కోసం శ్రమించే పారిశుధ్య కార్మికులకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వటం మంచి పరిణామమని, ఇలా వినూత్న రీతిలో ప్రయత్నించి సమాజంలో సహజ పరివర్తన సాధించటం ఆరెస్సెస్ కు మాత్రమే సాధ్యమని ప్రజలు ఆరెస్సెస్ ను ప్రశంసిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు నగరి పుర వీధులలో చేసిన కవాతు, సభా ప్రాంగణంలో చేసిన శారీరిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.