
తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 140 ప్రాంతాల్లో కొంతకాలంగా జరిపిన తవ్వకాల్లో పెద్దఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90 శాతం సింధూలోయ నాగరికత కాలం నాటివని ఆ శాఖ నిర్ధారించింది. బాణం, త్రికోణం, పూలు, చేప తదితర ఆకృతుల్లో ఉన్న 15,184 గుర్తుల్ని పరిశోధకులు పరిశీలించారు. వీటితో పాటు ఆంగ్ల యూ అక్షరం, వృత్తం, నిచ్చెన, ఎక్స్, స్వస్తిక్ గుర్తులు, చతురస్రాకార పెట్టెలను వెలికితీశారు. వీటిలో కొన్ని సవ్యదిశలో, ఇంకొన్ని అపసవ్య దిశలో ఉన్నాయి. శివగంగై జిల్లాలో కీళడితో పాటు తామిరభరణి నదీతీరాన ఉన్న శివగాలై, ఆదిచనల్లూరు ప్రాంతాల్లో ఈ ఆనవాళ్లు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఇవన్నీ 2,600 ఏళ్ల నుంచి 3,200 ఏళ్ల కిందటివిగా గుర్తించారు.
ఉత్తరాదితో సంబంధాలు
దక్షిణాదిలో లోహ యుగానికి, సింధూ నాగరికత రాగియుగానికి మధ్య దగ్గరి సంబంధాలున్నట్లు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకుల్లో ఒకరైన కె.రాజన్ తెలిపారు. ‘తరచి చూస్తే, రెండు ప్రాంతాల మధ్య నాగరికత, సంప్రదాయ వస్తు మార్పిడి జరిగినట్లుగా సంకేతాలున్నాయి. ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. తవ్వకాల్లో దొరికిన పూసలు, రాగి వస్తువులు, కుండలు, పైపులు, గాజులు, పెంకుల్లాంటి 700 కళాఖండాల్ని పరిశీలిస్తే, అవి ఉత్తర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది’ అని పరిశోధకులు వివరించారు. తూత్తుకుడి జిల్లా శివగాలై ప్రాంతంలో దొరికిన వస్తువులు 3200 ఏళ్ల కిందటివని అంచనా వేశారు. 120 సమాధుల్లో ఆ కాలపు వరిపొట్టును సేకరించారు.
శతాబ్ద కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలి పోయిన సింధు నదీ లోయ నాగరికత కాలం నాటి లిపిని పరిష్కరించిన వారికి 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. సింధూ నాగరికతను వెలుగులో వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన చెన్నైలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్..ఒకప్పుడు విలసిల్లిన సింధు లోయ నాగరికతకు చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరూ అర్థం చేసుకో లేకపోయారని పేర్కొన్నారు. లిపిని పరిష్కరించేందుకు ఇప్పటికీ పండితులు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. ఈ దిశగా కృషి చేసి, విజయం సాధించిన వ్యక్తులు, సంస్థలకు ప్రోత్సా హంగా 10 లక్షల డాలర్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు.





