
హిందూ ఆలయాల స్వయంప్రతిపత్తి మహోద్యమానికి విజయవాడలో అంకురార్పణ చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ బాధ్యతలను హిందువులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఆదివారం నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమ వివరాలను మీడియాకు వారు వెల్లడించారు. ఇక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలనుంచి లక్షల మంది తరలివస్తున్నారని మాజీ ఎంపీ, వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. ‘27వేల ఎకరాల మేర ఆలయాల భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాక్రాంతమయ్యాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్రంలో చట్టాన్ని సవరించాలని దాని తాలూకు ముసాయిదాను ఆయనకు ఇచ్చాం. ఇది జాతీయ ఉద్యమం. ఆలయాల ధనాన్ని ధర్మప్రచారానికే ఉపయోగించాలి. ఉత్తరాఖండ్‌లో ఆలయాల విముక్తి కోసం చట్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో మరో నాలుగు రాష్ట్రాల్లోనూ చేయబోతున్నారు’ అని వీహెచ్‌పీ క్షేత్ర కార్యనిర్వహణ కార్యదర్శి సత్యం, సంఘటన ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. పరిషత్ ప్రతినిధులు దుర్గాప్రసాదరాజు, ప్రాణేష్, వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.





