
సంభాల్ హింసకి సంబంధించి పోలీసులు చర్యలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణమైన వారిని, పరారీలో వున్న నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైపోయారు. మరి కొందర్ని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా కోర్టులో లొంగిపోయేందుకు సంభాల్ కి వచ్చిన షాజీబ్ ను అరెస్ట్ చేశారు. కోర్టుకు లొంగిపోయేందుకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నఖాసా కూడలిలో పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్ హింస సమయంలో షాజీబ్ కాల్పులు జరిపినట్లు పేర్కొంటున్నారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయగానే నిందితుడి నుంచి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. జామా మసీదు సర్వే సందర్భంలో జరిగిన అల్లర్ల సమయంలో తాను పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు షాజీబ్ అంగీకరించాడు కూడా.
అంతే కాకుండా అల్లర్ల సమయంలో ఇతని అనుచరులు నఖాసా కూడిలో ద్విచక్ర వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. ఈ ఘటన జరగ్గానే షాజీబ్ ఢిల్లీకి పారిపోయాడు. ఇదే సమయంలో ఈ అల్లర్లతో సంబంధమున్న మరో వ్యక్తి అద్నాన్ ను యూపీ పోలీసులు ఢిల్లీలోని బాట్లా హౌజ్ లో అరెస్ట్ చేశారు. ఈ కీలకమైన అరెస్టు కాగానే కోర్టులో లొంగిపోవాలని కాల్పులు జరిపిన షాజీబ్ నిర్ణయించుకున్నాడు. షాజీబ్ ఢిల్లీ నుంచి సంభాల్ కి రావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. షాజీబ్ కి రక్షణ కల్పిస్తున్నదెవరో అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
సంభాల్ హింసా కాండ తర్వాత నిందితులు ఢిల్లీలో తలదాచుకోవడంతో కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.షాజీబ్, అద్నాన్ లాంటి నిందితులు ఢిల్లీలో ఉండేందుకు, తలదాచుకోవడానికి ఎవరు సహకరించారు? చాలా మంది నిందితులు ఇంకా పరారీలో ఉన్నారన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. మరోవైపు ఢిల్లీలోని బాట్లా హౌజ్ లో అద్నాన్ అనే నిందితుడ్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా నిందితులు ఢిల్లీకి మకాం మార్చడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.





