ArticlesNews

జగ్గన్నతోట ప్రభల తీర్థం

363views

సంక్రాంతి పండగలో ముగ్గులు, భోగిపళ్ల సందడి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీటితోపాటు నిర్వహించే ప్రభల తీర్థానికీ అంతే ప్రాధాన్యం ఉంది. కనుమ రోజున జరిగే ఈ వేడుకకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోట వేదిక కానుంది. 170 గ్రామాల్లో నిర్వహించే ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించాలని ఆధ్యాత్మిక వేత్తలు, బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గతేడాది గణతంత్ర వేడుకలకు రాష్ట్రం నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ప్రదర్శనకు ఎంపికైంది. దేశంలో ఏకాదశ రుద్రులు కొలువుదీరేది కేవలం ఇక్కడే. యూత్‌ సభ్యులు 2020లో దేశప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయగా ఆయన ప్రతిలేఖ పంపించారు. నాలుగు శతాబ్దాల పైబడి ఈ ఉత్సవం జరపడం ఆనందదాయకమన్నారు. భారతీయ సంస్కృతికి సంప్రదాయాల పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయని, ఏకాదశ రుద్రుల ఆశీస్సులు అందరికీ ఉండాలని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. 2021లో శృంగేరి పీఠాధిపతులు విధుశేఖరభారతి మహాస్వామి సందేశమిస్తూ ఏకాదశ రుద్రుల సంగమం లోకకల్యాణం కోసమేనని పేర్కొన్నారు.

రూ.లక్షల్లో వ్యయం
సంక్రాంతి ప్రభల ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులకు రూ.లక్షల్లో వ్యయం అవుతుంది. ప్రభుత్వం నుంచి రూ.20 వేలు దాటి రాని పరిస్థితి. ఒక్కొక్క ప్రభ నిర్వహణకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు అవుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా గుర్తించి వీటి నిర్వహణకు నిధులు కేటాయించాలని కోనసీమ జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధి తాతా విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు లేఖల ద్వారా వివరించారు. ఈ విషయాన్ని మంత్రి సుభాష్‌ వద్ద ప్రస్తావించగా ప్రభల తీర్థంపై కోనసీమ వాసుల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.