News

జనవరి 5 న జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయండి

277views

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావానికి హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ జిల్లా సంపర్క ప్రముఖ్ కాళంరాజు రామకృష్ణ పిలుపునిచ్చారు.

ప్రకాశం జిల్లా, కొమరోలులో స్థానిక శివ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాల రక్షణ, హిందూ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా హిందువులే ఉండాలని అనే ప్రధానమైన డిమాండ్లతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలోని గన్నవరం దగ్గర హైందవ శంఖారావాన్ని లక్షలాదిమంది హిందువులతో నిర్వహిస్తున్నామని చెప్పారు.ఇందుకుగాను ప్రతి గ్రామం, దేవాలయం నుండి హిందూ బంధువులు విజయవాడ తరలిరావాలని అందులో భాగంగా మండలాల్లో మరియు గ్రామాల్లో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై ఇతర మతాలకు సంబంధించిన దాడులు విపరీతంగా జరిగాయి, దేవాలయాల వ్యవస్థను నాశనం చేసే విధంగా తిరుమల లడ్డు వ్యవహారం, పూజారులను ఇబ్బంది పెట్టే విధంగా దేవాలయాలపై దాడులు జరపడం మెజార్టీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా మారే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుందని, సనాతన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ప్రధానమైన ఉద్దేశంతో విశ్వహిందూ పరిషత్ గ్రామ గ్రామాల నుంచి హైందవ శంఖారావానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

హిందువుల యొక్క నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నామని, దేవాలయాల వ్యవస్థ ప్రభుత్వ ఆధీనం నుంచి హిందూ ధార్మిక పెద్దలకు అప్పచెప్పాలని,హిందూ దేవాలయాల్లో హిందువులే ఉద్యోగులుగా ఉండాలని,దేవాలయ కమిటీలకి రాజకీయ సంబంధం లేకుండా ఉండాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ తో పాటు వివిధ ధార్మిక సంఘాలు సంయుక్తంగా కలిసి పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వాలు మా డిమాండ్లను అంగీకరించి హిందువులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత గో సంరక్షణ ప్రముఖ్ బ్రహ్మా రెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా బాధ్యులు బండారు మాధవి, అవిశినేని రమణయ్య,బిజెపి మండల అధ్యక్షుడు రామిరెడ్డి, ఎస్ ఎస్ ఎఫ్ మండల బాధ్యులు కుమార వెంకటేశ్వర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.