News

ఆర్ఎస్ఎస్ నుంచి సేవా స్ఫూర్తి నేర్చుకోండి.. కేజ్రీ లేఖకు కౌంటర్

374views

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌ జీకి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖపై బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడ్డారు. కేజ్రీవాల్ లేఖ ఒక పబ్లిక్ స్టంట్ అని కొట్టివేశారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల జాబితా నుంచి పేర్లు తొలగించడం, ఓట్లు కొనుగోలు చేయడం వంటి బీజేపీ ఎత్తుగడలకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా అని మోహన్ భాగవత్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ప్రశ్నించారు.

దీనిపై త్రివేది స్పందిస్తూ, ఆర్ఎస్ఎస్ కు లేఖ రాసే బదులు సేవా స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్‌ నుంచి కేజ్రీవాల్ నేర్చుకోవాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవాభారతి మురికివాడల్లో నివసించే దళితులతో సహా దేశంలోని ప్రజల సంక్షేమం కోసం పాటుపడే అతిపెద్ద సంస్థ అని చెప్పారు.

కేజ్రీవాల్ లేఖలో ఏముంది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోహన్ భాగవత్‌కు కేజ్రీవాల్ ఒక లేఖ రాస్తూ పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ తప్పిదాలను మీరు ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. ఓటర్లను కొనేందుకు బహిరంగంగానే బీజేపీ డబ్బులు పంచుతోందని, పూర్వాంచల్, దళిత ఓట్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ దృష్టికి ఆయన తెచ్చారు. ఈ చర్యలను మీరు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలను డాక్యుమెంట్లు, డబ్బులతో ఆకట్టుకుంటూ వారిని ఆప్, కేజ్రీవాల్ తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నట్టు బీజేపీ ప్రత్యారోపణలు చేస్తోంది.