
ఉదారవాదులో.. ఊసరవెల్లులో ఎవరైతేనేం..! వీళ్లకి రోజులు అంతా బాగాలేవు. అమెరికాలో అయితే వీళ్లకి అసలు రోజులే కావు. మసాచుసెట్స్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్)లో ఈ మధ్య ఒక ఉదంతం జరిగింది. మిగతా ఎవరైనా అయితే మనకి అట్టే పట్టింపు అక్కర్లేదు. ఈ ఉదంతంలో కేంద్రబిందువు భారతీయ యువకుడు. ఆ సంస్థలో పరిశోధక విద్యార్థి, భారతీయ మూలాలు కలిగిన ప్రహ్లాద్ అయ్యంగార్ ని దాదాపు రెండేళ్లు బహిష్కరించింది. ఇందుకు కారణం తెలిస్తే కొంచెం వింతగానే ఉంటుంది. ఆ సంస్థ ఒక మ్యాగజైన్ ని వెలువరించింది. అందులో ఇతడు ఒక వ్యాసం రాశాడు. అదే కొంప ముంచింది. ఆ వ్యాసం పాలస్తీనాను సమర్ధిస్తూ రాశాడు మరి! ఫలితంగా జనవరి 2026 వరకు క్యాంపస్లోకి రాకుండా బహిష్కరించారు. ఐదేళ్ల ఇచ్చే నేషనల్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రిసెర్చ్ ఫెలోషిప్కు కూడా ఇతడిని అనర్హుడిని చేశారు. పనిలో పనిగా ఆ మ్యాగజైన్ ను కూడా నిషేధించారు.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో పరిశోధన చేస్తున్న ప్రహ్లాద్ ను నిరుడే సంస్థ నుంచి బహిష్కరించారు. విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. అన్నట్టు మ్యాగజైన్ లో వ్యాసం వెలగబెట్టినందుకే కాదు, అంతకుముందు సంస్థ ప్రాంగణంలో జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కూడా ప్రహ్లాద్ ను శాంపిల్ గా బయటకు పంపారు. తరువాత రాసిన వ్యాసంలో అతడు వాడిన భాష, ప్రయోగించిన పదాలు ప్రాంగణంలో హింసను ప్రేరేపిస్తున్నట్టే ఉన్నాయని సంస్థ నిర్వాహకులు ఆరోపించారు. ఇదే విషయాన్ని మ్యాగజైన్ సంపాదక మండలికి కూడా మిట్ డీన్ డేవిడ్ వారెన్ రాండల్ తెలియచేశాడు. ఈ వ్యాసంతో పాటు పాప్యులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థ చిహ్నం కూడా ప్రచురించారు. అదొక ఉగ్రవాద సంస్థ అని అమెరికా దేశీయాంగ శాఖ వెల్లడించింది. అయితే తన వ్యాసంతో పాటు ప్రచురించిన చిహ్నాలు, ఫోటోలు తాను, ఇచ్చినవి కావని ప్రహ్లాద్ చెబుతున్నాడు. సంస్థ చర్య అందరిని కలత పరిచిందని కూడా అభిప్రాయపడ్డాడు. ఈ సస్పెన్షన్ గురించి చాన్సలర్ కు మరొకసారి విజ్ఞప్తి చేస్తామని చెప్పాడు. ఈ పిలుపు వల్లే కాబోలు డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్లో ప్రదర్శన కూడా జరిగింది. యథాప్రకారం కొందరు నెటిజన్లు ప్రహ్లాద్ బహిష్కరణ గురించి గగ్గోలు పెడితే, ఇంకొందరు తగిన శాస్తి చేశారని అధికారులను మెచ్చుకున్నారు. ప్రహ్లాద్ బహిష్కరణ న్యాయమైనదే అంటూ వచ్చిన వ్యాఖ్యలలో కొన్ని గమనించదగినవే.
‘భారతీయ మూలాలు ఉన్న ఒక వ్యక్తి, ముస్లింల దాడికి గురైన కులం నుంచి వచ్చిన వ్యక్తి హమాస్ అనే ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం ఏమిటి?’ అని ప్రశ్నించింది. అసలు ఈ ప్రదర్శన చూస్తే ఓకిజం తర్కాన్ని, హేతువును ఎంత దారుణంగా హత్య చేస్తున్నాయో కూడా ఇట్టే అర్ధమవుతుందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అసలు నాగరిక సమాజంలో ఉగ్రవాదం ఏమిటి? దానిని సమర్ధించడం ఏమిటి అని కొందరు విమర్శించారు. గాజా మీద, సిరియా మీద అంత ప్రేమే ఉంటే అక్కడికే పోవచ్చునని కొందరు రాశారు. మరొక వ్యాఖ్య ఇదంతా ఎందుకు? ముందు అతడిని అరెస్టు చేసి లోపల పడేయండి అంటూ వచ్చింది. శుభం





