News

‘వైష్ణోదేవి రోప్‌వే’ నిర్మాణానికి వ్యతిరేకంగా షట్‌డౌన్‌ ప్రారంభం

315views

జమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్‌ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని నిరసనకారులు ఆందోళనను తీవ్రతరం చేశారు. బుధవారం నుంచి 72 గంటలపాటు పట్టణం మొత్తం బంద్‌ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారుల్ని అడ్డుకోవడంతో పలుచోట్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైష్ణోదేవి మందిరానికి చేరుకోవడానికి యాత్రికులు 13 కి.మీ పొడవునా ట్రెక్కింగ్‌ చేయాలి. పిల్లలకు, వృద్ధులకు ఈ ట్రెక్కింగ్‌ సవాలుగా మారడంతో సులభతరం చేసేందుకు రూ.250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించాలని పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయించింది. బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్‌కు పిలుపునిచ్చిన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష్‌ సమితి నాయకులు భూపిందర్‌ సింగ్, సోహన్‌ చంద్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలమంది ఉద్యోగాలను కాపాడేందుకే ఈ రోప్‌వే ప్రాజెక్టును నిలిపివేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, ప్రభుత్వం చర్చలు జరపడానికి బదులుగా పోలీసుల్ని ప్రయోగించి తమను నిర్బంధించడం దురదృష్టకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బంద్‌ పిలుపునకు స్పందనగా పట్టణంలో వ్యాపార సంస్థలన్నీ మూతపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిరసనకు ఇది సరైన సమయం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.