News

శివక్షేత్రానికి ‘కోటిలింగాల’ దత్తత!

349views

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సమీపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర వ్యవస్థాపకుడు శివస్వామికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీతారామయ్య ఆలయ రికార్డులను అప్పగించారు. ఈ సందర్భంగా శివస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. 2006లో 132 ఎకరాల స్థలాన్ని అప్పటి వ్యవస్థాపకుడు కంచికచర్లకు చెందిన గద్దె ప్రసాద్‌తో కలిసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండేళ్లపాటు స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆ క్రమంలో ప్రసాద్‌తో భిన్నాభిప్రాయాలు రావడంతో దూరంగా ఉన్నానని తెలిపారు. 2009లో క్షేత్రాన్ని రెండేళ్ల కాల పరిమితిలో ప్రహరీ, రాజగోపురం నిర్మించే ఒప్పందంతో దేవదాయ శాఖకు అప్పగించారన్నారు. ఈ క్రమంలో 2021లో భక్తులు రాకపోతుండటంతో ఆదాయం తగ్గిందని నిర్వహణ కష్టంగా ఉందని గద్దె ప్రసాద్‌ తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆలయాన్ని తిరిగి అప్పగించాలని కోరినట్లు చెప్పారు. దీంతో దేవదాయ శాఖ అధికారులు కోటిలింగ హరిహర క్షేత్రాన్ని దత్తత ఇస్తున్నామని చెప్పి రికార్డులు అందజేయగా ధర్మాధికారిగా తాను బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు.