News

హిందూ వారసత్వ మాసంను ప్రకటించిన అమెరికా రాష్ట్రం

418views

ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ మాసంగా జరుపుకొనేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ‘‘ఇది ఒహాయో, దేశంలో నివసించే హిందువులకు భారీ విజయం. ఇక నుంచి ఒహాయోలో ఏటా అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా మేం ఘనంగా నిర్వహించుకుంటాం’’ అని ఆ రాష్ట్ర సెనేటర్‌ నీరజ్‌ అంతానీ తెలిపారు. అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తూ ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. ఒహాయో చరిత్రలోనే తొలి హిందూ, భారతీయ అమెరికన్‌ స్టేట్‌ సెనేటర్‌గా అంతానీ గుర్తింపు పొందారు. అంతేకాకుండా స్టేట్‌ లేదా సమాఖ్యకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడైన హిందూ, భారతీయ అమెరికన్‌గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ‘‘దేశంలో, ఒహాయో రాష్ట్రంలో హిందువులు చేసిన కృష్టికి ఇది నిదర్శనం. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి నేను వారితో భాగస్థుడిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అంతానీ చెప్పారు. ఈ బిల్లు ఇప్పుడు గవర్నర్‌ ఆమోదం కోసం వెళ్లనుంది.