
ఆరోగ్యప్రదాత.. ప్రత్యక్షదైవం.. శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనా రాయణస్వామి రథసప్తమి వేడుకలు ఇకపై అధికారికంగా జరగనున్నాయి. ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ‘అరసవల్లిలో ప్రతీ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో సూర్యదేవుని పుట్టిన రోజు(రథసప్తమి) వేడుకలను నిర్వహిస్తుంటాం. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామిని దర్శించుకుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారా యణరెడ్డికి, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకి, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. అలాగే ప్రసాద్ పథకంలో భాగంగా ఆదిత్యా లయ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరు చేసిందన్నారు.
అధికారికంగా రథసప్తమి
కాగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో నిర్వహించే రథసప్తమి రాష్ట్రస్థాయి పర్వదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4న అరసవెల్లి సూర్యనారాయణస్వామి రథసప్తమి జరగనుంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆదేశించింది. రథసప్తమితోపాటు 3 రోజులపాటు పర్వదినంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానం వేడుకలను నిర్వహిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది.





