News

కూచిపూడి కళాపీఠంలో ఉత్తరప్రదేశ్‌ విద్యార్థులు

392views

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నుంచి వచ్చిన విద్యార్థులతో కృష్ణాజిల్లా కూచిపూడిలో గల శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం సందడిగా మారింది. భారత్‌–శ్రేష్ట్‌ భారత్‌లో భాగంగా ఐదో విడతగా వచ్చిన 44 మంది విద్యార్థులకు కళాపీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కళాపీఠంలోని విశేషాలను తెలుసుకున్నారు. కూచిపూడి యక్షగానాలలో పూర్వీకులు వినియోగించిన సంప్రదాయ ఆభరణాలు, నాట్యంలో వినియోగించే హస్త పాదముద్రికలు, నాటి నేటి నాట్యాచార్యుల చిత్రాలను తిలకించారు. నాట్య విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌పీఏవై డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ శ్రీకొండ పర్యవేక్షించగా.. నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాయేష్‌, డాక్టర్‌ కృష్ణకుమార్‌, డాక్టర్‌ ధీరజ్‌(టీం లీడర్‌), డాక్టర్‌ రంఘీర్‌, డాక్టర్‌ రాధిక గౌర్‌ విద్యార్థులతో ఉన్నారు.