
346views
ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దారితప్పిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నిజాంపట్నానికి చెందిన మోపిదేవి ఓంకార్, సాంబశివరావు (కర్రీస్ పాయింట్ నిర్వాహకుడు)లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమందిని కలుపుకుని మొత్తం 15 మంది ఈ నెల 16న శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శనం పూర్తయ్యాక నల్లమల అడవుల్లోని ఇష్టకామేశ్వరిదేవి ఆలయం సందర్శించేందుకు అడవిమార్గాన వెళుతూ దారి తప్పారు. ఈ విషయాన్ని గ్రహించి భయాందోళనకు గురైన వీరు సాయంత్రం 6 గంటల సమయంలో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, స్థానిక ఫారెస్ట్ అధికారుల సహాయంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తుల ఆచూకీ తెలుసుకుని, సురక్షితంగా శ్రీశైలం ప్రాంతానికి తరలించారు.





