News

సంభాల్‌లో ఏకంగా అక్రమ ‘‘పవర్ హౌస్’’… 1,250 ఎఫ్ఐఆర్‌లు నమోదు

305views

సంభాల్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యం, అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని సీఎం యోగి కూడా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చౌర్యానికి సంబంధించి 1,250 FIRలు నమోదయ్యాయి. మరోవైపు 5.2 కోట్ల రూపాయల జరిమానాలు కూడా విధించారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా కూడా ప్రకటించారు.

మరోవైపు విద్యుత్ మీటర్‌లో ట్యాంపరింగ్ జరిగిందని, పార్లమెంట్ సభ్యులు జియావూర్ రెహ్మాన్ బూర్కే ఇంటిపై విద్యుత్ శాఖ దాడులు చేసింది. ఎంపీ నివాసంలోని విద్యుత్ కనెక్షన్లు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరెంటు బిల్లు సున్నాకి ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీశారు. అలాగే మీటర్లను కూడా తనిఖీ చేశారు. సుమారు గంట పాటు ఈ విచారణ సాగింది. పాత మీటర్లను ల్యాబ్ పరీక్షలకు పంపి, ఇంటి వద్ద పకడ్బందీ కేబుల్‌తో వున్న స్మార్ట్ మీటర్‌ను అమర్చింది. ఒక మీటర్ పై జీరో లోడ్ వుండగా, మరో మీటరుపై 5.9 కిలోవాట్ల లోడ్ నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. అయితే రెండు కనెక్షన్ల మీటర్లు వేర్వేరు సమయాల్లో చాలా కాలం పాటు స్విచ్ ఆఫ్‌లో వున్నాయని, దీని కారణంగానే సున్నా రీడింగ్‌లు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా ఈ విద్యుత్ చౌర్యం కేసులు మసీదులు, మదర్సాలు, నివాస ప్రాంతాల్లోనే అధికంగా వున్నట్లు గుర్తించారు. సంభాల్‌లోని సదర్, దీపాస్రాయ్ ప్రాంతాల్లో అధికంగా వుంది.అంతేకాకుండా విద్యుత్ చౌర్యం చేసే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు 200 నివాసాల్లో విద్యుత్ చౌర్యం కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనుగొన్నామని అధికారులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.

మొదట మసీదుల కుండే లౌడ్ స్పీకర్ల విషయంలోనే తెలుసుకునేందుకు అధికారులు పర్యటన ప్రారంభించారు. కానీ విద్యుత్ చౌర్యం అంటూ అధిక స్థాయిలో ప్రచారం కావడంతో దానిపై దృష్టి నిలిపారు. 150 నుంచి 200 ఇళ్ల వరకూ సోదాలు చేశామని, 5 నుంచి 6 మసీదులను కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. పోలీసుల నివేదికల ప్రకారం సంభాల్ లోని ఓ మసీదు పై అంతస్తులో ఏకంగా ఓ అక్రమ పవర్ హౌస్‌నే కనుగొన్నారు. దీని నుంచి 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఇవన్నీ బయటపడటంతో అధికారులు మరింత అధిక స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు.

అధికారులు వెంటనే అన్ని అక్రమ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసి, దోషులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. చోరీకి పాల్పడిన వారికి జరిమానాలు విధిస్తారు. దొంగిలించబడిన విద్యుత్తును ఉపయోగించి మసీదులు మరియు మదర్సాలు వంటి మతపరమైన ప్రదేశాలు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.