
వక్ఫ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లోని దేవాలయాలు, రైతుల భూములు తమవేనంటూ ఏకపక్ష నిర్ణయాలు ప్రకటిస్తోంది. దీంతో యావత్ సమాజం వక్ఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణె నగరంలో వక్ఫ్ కారణంగా 135 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో ముస్లిం కుటుంబాలు కూడా వున్నాయి. వక్ఫ్ కారణంగా హిందూ కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
పుణే కస్బాపేట ప్రాంతంలోని కుంభార్ వాడలో (కుమ్మరివాడ) పుణ్యేశ్వర్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఒక చిన్న కాలనీ ఉండేది. మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టు కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ కాలనీలోని 135 ఇళ్ళను 2016లో పడగొట్టారు. అయితే అక్కడ అభివృద్ధి పనులు మొదలుపెట్టే సమయంలో స్థానిక ముస్లిం ఒకడు ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటూ, బోర్డు తరఫున వాదనలు మొదలుపెట్టాడు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్న అధికారులు ఆ ప్రాజెక్టును పక్కన పడేసారు. దాంతో గత ఎనిమిదేళ్ళుగా ఆ 135 కుటుంబాల వారూ నిరాశ్రయులుగా మిగిలి పోయారు. కాలనీని అభివృద్ధి చేసి కొత్త ఇళ్ళు ఇస్తారనుకుంటే, ఉన్న గూడు కూడా చెదిరిపోయిందే అని వారు వాపోతున్నారు.
కస్బాపేటలోని పుణ్యేశ్వర్ సొసైటీలో హిందువులతో పాటు ముస్లిములు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వారందరికీ ఇప్పుడు తలదాచుకోడానికి ఇల్లు లేని పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఇళ్ళకు బదులు ఆధునిక నివాసాలు, మెరుగైన జీవనప్రమాణాలు, ఉజ్వల మైన భవిష్యత్తు వస్తాయని స్థానికులు ఆశించారు. దాంతో ఉన్న ఇళ్ళను కూలగొట్టే పని మొదలైంది. ఆ సమయంలో వారికి డెవలపర్లు అద్దె కూడా చెల్లించారు.
అయితే, ఒకసారి ఇళ్ళన్నీ కూలగొట్టడం పూర్తయాక, నిర్మాణం మొదలుపెట్టడానికి ముందు ఆ ప్రాంతానికి చెందిన స్థానిక ముస్లిం వ్యక్తి ఒకరు కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చాడు. అక్కడికి చేరువలో ఒక చిన్న దర్గా ఉందని, అందువల్ల ఆ ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందుతుందనీ అతని వాదన. అనూహ్యమైన ఆ పరిణామంతో పునర్నిర్మాణ పనులు ఆగిపోయాయి. స్థలం ఖాళీగా మిగిలి పోయింది. మెరుగైన జీవితం గురించిన కలలన్నీ ఆ శిథిలాల్లో కలిసిపోయాయి.
ఆటోరిక్షా నడుపుకునే 45ఏళ్ళ అనీఫ్ షేక్ బాధ వర్ణనాతీతం. ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా జీవితం అంతా ఈ ప్రదేశంతోనే ముడిపడి ఉంది. వాళ్ళు మా ఇళ్ళను కూల్చేసారు, అంతకంటె మెరుగైన ఇళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఈ భూమి వక్ఫ్ బోర్డుది అంటున్నారు. మాకు మా భూమి కావాలి’’ అని ఆవేదన చెందుతున్నాడు.
‘‘ఈ వ్యవహారంలో మతం అనేది విషయం కాదు. మేమందరం దశాబ్దాలుగా కలిసే బతుకుతున్నాం. ఇప్పుడు ఈ ప్రకటనతో మా అందరి బతుకులు తలకిందులు అయిపోయాయి. మేమిప్పుడు ఇక్కడ తాత్కాలిక నిర్మాణాలతో తలదాచుకున్నాం. ఈ మధ్యనే ఒక పాము కరవడంతో ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ మా ఇళ్ళను మాత్రమే కాదు, మా జీవితాలను కూడా పడగొట్టేసారు’’ అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు 80ఏళ్ళ అబూ సయ్యద్.
సుశీలాదేవి అనే మహిళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఆమె, ఆమె భర్త ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఈ ఇళ్ళ కూల్చివేత, వక్ఫ్ బోర్డు గొడవతో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఆమె భర్త రెండు నెలల క్రితం చనిపోయారు. ‘‘నేను ఒంటరినైపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ గొడవ నా సర్వస్వాన్నీ లాగేసుకుంది. నా ఇల్లు, నా ఆత్మగౌరవం, ఆఖరికి నా భర్త అన్నీ పోయాయి’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
చిత్రంగా, దర్గా ట్రస్ట్ సభ్యులు కూడా కిమ్మనడం లేదు. ఈ పరిణామం ఎటుపోయి ఎటు వస్తుందో అర్ధం కాక, ప్రజలకు మద్దతిస్తే వక్ఫ్ బోర్డు తమను ఏం చేస్తుందోనన్న భయంతో అధికారులు నోరు మెదపడం లేదు.





