
తిరుమలలో కూల్చివేసిన అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించాలని, అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నమయ్య జానపద కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకరస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలోని మంగళం బీటీఆర్ కాలనీలోని అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలన భవనం వద్దకు వందలాది మంది కళాకారులు, శ్రీవారి భక్తులు శోభాయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో హరినామ సంకీర్తన కోసం నమోదు చేసుకున్న 7 వేల బృందాలకు అవకాశం కల్పించాలన్నారు. శ్రీవారి గొప్పతనాన్ని అన్నమయ్య తమ కీర్తనల ద్వారా దేశం సరిహద్దులు దాటించి, వ్యాపింప చేశారన్నారు. అన్నమయ్య ప్రాచుర్యాన్ని తగ్గించడానికి 2003లో తిరుమలలో అన్నమయ్య గృహాన్ని కూల్చివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమి పాపం చేశారని అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలు తొలగించారని ప్రశ్నించారు. అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలను పునఃప్రతిష్ట చేయాలని టీటీడీ యాజమాన్యాన్ని కోరితే ఇంతవరకు అతీ, గతిలేదన్నారు. భజన కళాకారులు తిరుమలలో హరినామ సంకీర్తన కోసం 7 వేల బృందాలు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. జానపద గురువులకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని టీటీడీ యాజమాన్యాన్ని కోరారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా హరినామ సంకీర్తన కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. డిమాండ్‌లు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఉపవాస హరినామ సంకీర్తన నిరసన కార్యక్రమాన్ని పరిపాలన భవనం వద్ద చేపడతామని హెచ్చరించారు.




