News

కనులపండువగా శోభాయాత్ర

318views

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ పురవీధుల్లో హనుమాన్‌ శోభాయాత్ర కనులపండువగా సాగింది. 40 రోజులుగా దీక్షలో ఉన్న స్వాములు ముందుగా గుంతకల్లు మండల పరిధిలోని ఎన్‌.తిమ్మాపురం గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద భక్తిశ్రద్ధలతో ఇరుముడి ధరించారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని బళ్లారి గేట్‌ సమీపంలోని అభయాంజనేయస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చారు. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో రథాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. కేరళ వాయిద్య కళాకారులు, నంద్యాల జిల్లా వెలు గోడుకు చెందిన కళాకారుల కోలాటం మధ్య శోభాయాత్ర సాగింది. బీరప్పగుడి సర్కిల్‌, ప్రధాన రహదారి, సత్యనారాయణపేట మీదుగా కసాపురం వరకు సాగిన ఉత్సవంలో జై శ్రీరామ్‌, జై నెట్టికంటి ఆంజనేయస్వామి నామస్మరణలు మార్మోగాయి. ఆలయ ప్రాంగణంలో మాలధారులు ఇరుముడి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వాణి, కమిటీ చైర్మన్‌ కె.సుగణమ్మ పాల్గొన్నారు.