News

బంగ్లాలో హిందువులపై దాడులు.. ఉత్తర భారతంలో భారీ నిరసన ర్యాలీ

256views

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉత్తర భారతంలోని పలు హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. హిందువుల నరమేధాన్ని బంగ్లాదేశ్‌ నిలుపు చేయాలని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఆరెస్సెస్‌ సహా వివిధ సంస్థలకు చెందిన వందల మంది దిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పొరుగు దేశంలో దారుణాలకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో కూడా ఆందోళనకారులు ప్రదర్శన జరిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో షాహీద్‌ సమార్‌ నుంచి డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. రాజస్థాన్‌ గవర్నర్‌కు ఆ రాష్ట్రానికి చెందిన మేధావుల బృందం వినతి పత్రం అందించింది. తాజా ఆందోళనల నేపథ్యంలో దిల్లీలోని చాణక్యపురిలో గల బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయానికి పోలీసులు భద్రతను పెంచారు.

70 మందిని అరెస్టు చేశాం: బంగ్లాదేశ్‌
ఢాకా: షేక్‌ హసీనా రాజీనామా అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్‌ అంగీకరించింది. వీటిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మతపరమైన హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్‌ యూనస్‌ ప్రెస్‌ కార్యదర్శి షఫీకుల్‌ ఆలమ్‌ వెల్లడించారు.