ArticlesNews

ఖండాంతరాలు దాటిన నిమ్మలకుంట ఖ్యాతి

254views

హస్తకళల్లో తోలుబొమ్మలాట ఒకటి.. ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం నింపి ఆంగ్లేయులపై పోరాడేలా చేసింది. సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులో లేనప్పుడే తోలుబొమ్మలాట పెద్ద ఎత్తున ప్రజలకు సమాచారాన్ని చేరవేసింది. టీవీలు, సినిమాలు ప్రాచుర్యంలోకి రాని రోజుల్లోనే అది ప్రజలకు వినోదాన్ని పంచింది. విజ్ఞానాన్ని అందించింది. ఆధునిక సాంకేతిక యంత్ర పరిజ్ఞానం రాకతో హస్తకళలు కనమరగవుతున్న వేళ.. నిమ్మలకుంట ఆ కళను కాపాడుతూ ఖండాంతరాల ఖ్యాతిని గడించింది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు హస్తకళల వారోత్సవాలను పురస్కరించుకుని నిమ్మలకుంట వాసుల హస్తకళపై ప్రత్యేక కథనం.

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామం తోలుబొమ్మల కళ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది. వాటి తయారీ, ప్రదర్శనలో ఇక్కడి కళాకారులకు అందెవేసిన చేయి. రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలను తోలుబొమ్మలపై అద్భుతంగా చిత్రీకరించి గ్రామాల్లో ప్రదర్శన చేస్తూ జీవనం చేసేవారు. మహారాష్ట్ర నుంచి నాలుగు వందల ఏళ్ల క్రితం ఆ కళాకారులు నిమ్మలకుంటకు వలస వచ్చారు. ఇక్కడ నివాసాలు ఏర్పరుచుకుని ఆ కళ అంతరించకుండా కాపాడుతున్నారు. తోలుబొమ్మల తయారీ ఒకవైపు, మరోవైపు వాటిని ప్రదర్శన చేస్తున్నారు. ఈగ్రామంలో కళాకారుల కుటుంబాలు 150 దాకా ఉన్నాయి. ఒకప్పుడు తోలుబొమ్మలాట ప్రదర్శనకు ఎంతో ఆదరణ ఉండేది. సినిమాలు, టీవీల ప్రభావంతో కళకు ఆదరణ తగ్గింది. సింగపూర్, జపాన్, జర్మనీ, లండన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, స్పెయిన్‌ విదేశీగడ్డపై సైతం ప్రదర్శన నిర్వహించి మన్ననలు పొందిన కళాకారులు.. ప్రజాదరణ తగ్గినా ఎక్కడా వెనకడుగు వేయలేదు.

మారిన కాలానికి అనుగుణంగా..
మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని తోలుబొమ్మలపై వివిధ రకాల చిత్రాలు రూపొందించడం ప్రారంభించారు. గృహోపకరణాలు తయారు చేశారు. గృహాల్లో అందంగా కనిపించేలా ల్యాంప్‌లు, గోడచిత్రాలు, తోరణాలు తయారు చేసి వాటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. వాటికి మంచి ఆదరణ లభించింది. ఇక్కడ తయారు చేసిన చిత్రాలు, ల్యాంప్‌లు తదితర గృహోపకరణాలను ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండు ఉంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా వంటి నగరాల్లో వాటి విక్రయాలకు తరచూ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి ఆదాయం పొందుతున్నారు. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లోని ఘట్టాలను తోలుబొమ్మలపై అద్భుతంగా చిత్రీకరించి సింగపూర్, మలేషియా, జర్మనీ, జపాన్, స్పెయిన్‌ తదితర దేశాల్లో వాటిని విక్రయిస్తున్నారు. దీంతో నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులకు ఏడాదంతా ఉపాధి లభిస్తోంది. మహిళా కళాకారులు గృహోపకరణాల తయారీలో రాణిస్తున్నారు.

పది మందికి జాతీయ అవార్డులు
నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు రూపొందించిన రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. దళవాయి చలపతిరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దళవాయి శివమ్మకు శిల్పగురు అవార్డు దక్కింది. జాతీయ అవార్డులు పొందినవారిలో కుళ్లాయప్ప, సిందే చిదంబరరావు, శ్రీరాములు, హనుమంతు, అంజినప్ప, మారుతిరావు, శ్రీనివాసులు, చిన్నకుళ్లాయప్ప ఉన్నారు. రాష్ట్ర స్థాయి అవార్డులు 20 మంది కళాకారులు అందుకున్నారు.

క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే కళ మరింత అభివృద్ధి – కుళ్లాయప్ప, జాతీయ అవార్డు గ్రహీత
తోలుబొమ్మల కళను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్‌ను నిమ్మలకుంటలో ఏర్పాటు చేయాలి. మా ముందు తరాల వారు ఆ కళపై మాకు చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇచ్చారు. భవిష్యత్‌లో కళ అంతరించకుండా క్లస్టర్‌ ఏర్పాటు చేసి నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇస్తే మరింత రాణించగలం. నగరాల్లో ఎగ్జిబిషన్లలో కళాకారులు తయారుచేసిన కళాఖండాల ప్రదర్శనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. మార్కెటింగ్‌ సౌకర్యం అంతర్జాతీయంగా చేస్తే మరింత ఉపాధి కలుగుతుంది.