
శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన శనివారం దేవస్థానం ఇంజినీరింగ్, పరిపాలన, వసతి, పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో పారదర్శకత అవసరమని చెప్పారు. క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఇటీవల పూర్తి చేసిన పనులు, ప్రస్తుతం జరుగుతున్నవి.. భవిష్యత్తులో చేపట్టాల్సిన వాటిపై చర్చించారు. శాస్త్రీయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించాలని ఈఈలు, డీఈలు, ఏఈలకు ఈవో సూచించారు. పనుల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దని ఉద్యోగులకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని చెప్పారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప కార్యనిర్వాహణాధికారి ఆర్.రమణమ్మ, ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





