News

కట్టబొమ్మన్ చరిత్ర మీద కొత్త వెలుగు

65views

‘భారత స్వాతంత్య్రం కోసం కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు జరిగిన యుద్ధాలను అధ్యయనం చేస్తే బ్రిటిష్ జాతి ఎంత మూల్యం చెల్లించిందో అవగాహనకు వస్తుంది. ఒక్క పాంచాలన్కురిచ్చి 110 రోజుల యుద్ధాలను తీసుకున్నా ఇది అర్ధమవుతుంది. 800 పైగా బ్రిటిష్ సైన్యం ఆ యుద్ధాలలో హతమైంది. ఇందులో 49 మంది ఉన్నత సైనికాధి కారులు కూడా ఉన్నారు. ఇవన్నీ బ్రిటిష్ మ్యూజియంలో దొరుకుతున్న ఆధారాలే అంటున్నారు చరిత్రకారుడు పి.సెంథిల్ కుమార్ పాంచాలన్కురిచ్చి యుద్ధాలు చేసిన వీరుడే వీరపాండియ కట్టబొమ్మన్.

పాంచాలన కురిచ్చి వీరుడు, ఈస్టిండియా కంపెనీ సేనలను ముప్పుతిప్పలు పెట్టిన కట్టబొమ్మన్ జీవితం లోని మరుగున పడిన పలు అంశాలతో ఒక కొత్త పుస్తకం వెలువడింది. అంటే కట్టబొమ్మన్ను ఉరి తీసిన 223 సంవత్సరాల తరువాత ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ‘ది బ్యాటిల్స్ ఆఫ్ పాంచాలన్ కురిచ్చి-యాన్ అన్జపెన్డ్ డైరీ 1792-1801’ పేరుతో పి. సెంథిల్కుమార్ పుస్తకం రాశారు. ఇటీవలనే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆవిష్కరించారు. ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా, కట్టబొమ్మన్, ఆయన సోదరులు సాగించిన యుద్ధాల లోని కొత్త వాస్తవాలు ఇందులో పొందుపరిచారు. పాంచాలన కురిచ్చి యుద్ధాలంటే పాలెగాళ్లకూ, కంపెనీకీ మధ్య జరిగిన కీలక ఘర్షణలే. 18వ శతాబ్దం చివర, 19 శతాబ్దం ఆరంభంలోను ఇవి జరిగాయి. కట్టబొమ్మన్ జీవితం ఆధారంగా ప్రచారంలో ఉన్న జానపద కథలను వేరు చేసి వాస్తవ చరిత్రను అందించినట్టు సెంథిల్ కుమార్ చెప్పారు. రచయిత మద్రాస్ పురా లేఖన భాండాగారం నుంచి ఎంతో సమాచారం సేకరించడమే కాకుండా, ఇంగ్లండ్లోని బకింగ్ హ్యామ్ పేలెస్ మ్యూజియం నుంచి వివరాలు తీసుకున్నారు. కట్టబొమ్మన్ ఉపయోగించిన కరవాలం ఇప్పటికీ అక్కడే భద్రపరిచి ఉందని ఈ మ్యూజియం అధికారులు తెలియచేశారు. ఒక్క తమిళనాడు పురా లేఖన భాండాగారంలోనే 1353 పేజీల సమాచారం ఉంది. యుద్ధం జరుగు తున్న కాలంలో రోజువారీ వివరాలతో 11 విభాగాలు చేసి బకింగ్ హ్యామ్ పేలెస్ మ్యూజియంలో భద్రపరిచారు. 1798. 1799లలో కట్టబొమ్మన్ కంపెనీ అధికారులతో జరిపిన చర్చలు, ఒకటో పాళయం యుద్ధం, 1801లో కట్టబొమ్మన్ ఉరి,కట్టబొమ్మన్ సోదరులు ఊమైతురై, శివతాయి స్థితిగతులు, రెండో పాళయం యుద్ధం గురించి వివరాలు ఉన్నాయి. రెండో పాళయం యుద్ధం ఊమైతురై చేశాడు. పాళయకొట్టం జైలు కూల్చివేత గురించి ఈ పుస్తకంలో వివరించారు.

ఆర్కాట్ నవాబుకూ ఈస్టిండియా కంపెనీకీ మధ్య కుదరిన ఒప్పందం (జూలై 12, 1792)తో బ్రిటిష్ జాతికి పన్ను వసూలు అధికారం వచ్చింది. జిల్లా కలెక్టర్లు పన్ను వసూళ్ల మీద పడ్డారు. అప్పుడే ఈ విధంగా ప్రకటించారు. ‘ఇప్పుడు ఈ దేశం మొత్తం మా అధీనంలో ఉంది. ఈ దేశానికి మేమే ప్రభువులం. మాదే ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చే అన్ని ఆదేశాలను పాలెగాళ్లు పాటించి తీరాలి. ఏ ఒక్క పాలెగాడు సొంత సైన్యాన్ని పోషించకూడదు. పన్ను వసూలు చేయకూడదు.ఈ ఆదేశాలను కట్టబొమ్మన్ నిరాకరించాడు.

ఈ పుస్తకం తరువాత మరొక పుస్తకం కూడా సెంథిల్ కుమార్ విడుదల చేయబోతున్నారు. అందులో ఉరి తరువాత కట్టబొమ్మన్ భౌతికకాయం ఏమైంది అన్న విషయం వివరించారు. నిజానికి ఇప్పుడు ఈ వివరాలు, పుస్తకాల అవసరం ఉంది. 1960 ప్రాంతంలో పాలెగాళ్ల మీద, వారిలో ఒకడైన కట్ట బొమ్మన్ మీద కావలసినంత దుష్ప్రచారం జరిగింది. కట్టబొమ్మన్ అసలు స్వాతంత్ర్య పోరాట యోధుడు కాదు అన్నది ప్రచారాలలో ఒకటి. అయితే కట్ట బొమ్మన్ కోసం యుద్ధం చేసి 5000 మంది చనిపోయారు. అందులో అన్ని వర్గాల వారు ఉన్నారు.