News

లెంపలేసుకున్న నొమానీ

201views

ఇటీవలే మహారాష్ట్రలో ‘ఓట్ జిహాద్’ పిలుపు ఇచ్చి సంచలనం సృష్టించిన మౌలానా సజ్జాద్ నౌమానికి బుద్ధి వచ్చినట్టుంది. హిందువులు ఓట్ జిహాద్ అవసరం లేకుండానే బీజేపీ నేతృత్వంలోని మహాయుతిని గెలిపించడంతో, పొరపాటు జరిగింది క్షమించమంటున్నాడు తాలిబన్ ఆరాధకుడు నౌమానీ, ముస్లింలంతా ఓట్ జిహాద్ చేసి మహావికాస్ అఘాదీని గెలిపించాలని ఎన్నికలకు ముందు కోరిన అతడు, కేవలం వారి ఓట్లతో అధికారం చేజిక్కదని అర్థం చేసుకున్న విజ్ఞతతో సులువుగా క్షమాపణ పత్రాన్ని విడుదల చేసేశాడు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి సొమానీ ముస్లింలు ఎవరైనా తన మాట కాదని కాషాయపార్టీకి వోటు వేస్తే వారిని బాయ్ కాట్ చేస్తానని కూడా బెదిరించాడు. అంతేకాదు, మహారాష్ట్రలో బీజేపీ ఓడితే, అది కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేస్తుందన్నాడు. పైగా, బీజేపీని సమర్ధించే ముస్లింలు తమ పేరు ఘనాశ్యామ్ అని మార్చుకోవాలని సలహా కూడా పడేశాడు.

మహాయుతి గెలిచిన తీరు, తన మాటలకున్న విలువ అర్ధం కావడంతో, ఆత్మ రక్షణ కోసమూ, ఎన్నికల సమయంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టినందుకు క్షమించండంటూ అధికారికంగా క్షమాపణ పత్రాన్ని విడుదల చేశాడు. బీజేపీకి ఓటువేసిన ముస్లింలను బాయ్ కాట్ చేస్తామన్న నా మాటలు ఒక నిర్దిష్ట సందర్భంలో అన్నవి. లోక్సభ ఎన్నికలలో వీరిని ఓటు వేయనివ్వలేదు. సాధారణ పౌరుడు తన హక్కుని వినియోగించుకొని ఓటువేయకుండా నివారిస్తున్న వారిని ఉద్దేశించి అన్న మాటలు. కనుక, నా మాటలను సందర్భోచితంగా తీసుకోవాలే తప్ప మరోలా కాదు అని భాష్యం చెప్పాడు.అలాగే, నా పై ప్రకటన మహారాష్ట్ర ఎన్నికలకు ముందుగా ఇచ్చింది. అది ఏ మతపరమైన సమాజాన్ని ఉద్దేశించి అన్నది కాదు, నా ఉద్దేశమూ అది కాదు. అదేమీ ఫత్వా కూడా కాదు. అయితే, నా ప్రకటన ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, షరతులు లేకుండా క్షమాపణలు చెప్తాను. వారు ముస్లింలు అయినా కాకున్నా, నేను ఎప్పుడూ అన్యాయం జరిగిన సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం కోసం పోరాడాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక, పూర్తిగా ముస్లిం వస్త్రధారణతో తలపై ముసుగు వేసుకొని గొప్ప ఫెమినిస్టు స్వరాభాస్కర్, ఆమె భర్త ఫహాద్ అహ్మద్ మద్దతు, ఆశీర్వచనం కోసం ఆయనను కలుసుకున్న విషయం తెలిసిందే. ఎన్సీపీ టిక్కెటుపై అణుశక్తి నగర్ నుంచి పోటీ చేసిన ఫహాద్, మహాయుతికి చెందిన సనా మాలిక్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కాగా, సనా మాలిక్ కూడా నొమానీని కలుసుకోవడంతో, ఆమె ద్వంద్వ వైఖరిని నెటిజెన్లు దుయ్యబట్టారు. అయితే, తాను ఓటింగ్ పూర్తి అయిన తర్వాతే ఆయన్ని కలుసుకున్నానంటూ సనా నిస్సిగ్గుగా తనను తాను సమర్ధించుకోవడం వేరే విషయం.