
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ వరిష్ట కార్యకర్తగా, భారతీయ శిక్షణ మండల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆజీవనం సేవలందించిన ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం సంస్మరణ సభ “విశ్వ చింతన్” నవంబర్ 16న విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ (ద్వారకా నగర్)లో జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఎస్. రామచంద్ర శెట్టి (గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, బెంగళూరు) మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగంలో 40 సంవత్స రాల సుదీర్ఘకాలం ఆచార్యునిగా పనిచేసిన విశ్వేశ్వరంగారు యూనివర్సిటీకి వివిధస్థాయిలలో ఎన్నో సేవలను అందించారని, జాతీయ- అంతర్జాతీయ సదస్సులలో ఫార్మసీకి సంబంధించి ఎన్నో పరిశోధనపత్రాలు సమర్పించారని, ఫార్మసీ రంగంలో కొన్ని వందల మంది విద్యార్థులను నిపుణులుగా తయారు చేశారనీ అన్నారు. వృత్తిపరంగానే కాకుండా, ఆజీవనమూ దేశకార్యంకోసం తనను తాను సమ ర్పించుకున్న ఆదర్శ స్వయం సేవక్ విశ్వేశ్వరంగారని రామచంద్ర శెట్టి అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వి.ఆర్. రాంబాబు(కార్యదర్శి, భారతీయ విద్యాకేంద్రం, ఆంధ్రప్రదేశ్) మాట్లాడుతూ సంఘపరివార్లోని వివిధ సంస్థల కార్యకర్తలందరితో విశ్వేశ్వరంగారు కుటుంబ సంబంధాలు నెరపేవారని, ప్రతి కార్యకర్త శ్రేయస్సును కోరుకుంటూ అండగా నిలుస్తూ కుటుంబ పెద్దగా మార్గదర్శనం చేసిన విశ్వేశ్వరం గారు చిరస్మరణీయులన్నారు. విశ్వేశ్వరంగారి సతీమణి డి.వి. రమణమ్మ వ్రాసిన “మన ఇతిహాసగాధలు” పుస్తకాన్ని ఎస్.జ్యోతి మాధవి (డిప్యుటీ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్,విశాఖ) ఆవిష్కరించారు. విశ్వేశ్వరం గారి బంధువులతోపాటు, సంఘపరివార్ కార్యకర్తలు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





