ArticlesNews

హైందవ శంఖారావం మరో ధార్మిక స్వాతంత్ర్య పోరాటం

743views

నాతన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు, సంస్కృతికి మూల స్తంబాలు, అనాదిగా ధర్మ ప్రచార కేంద్రాలు మన ఆలయాలు. హిందూ సమాజ సంఘటనాశక్తికి, సామాజిక సమరసతకు కేంద్రాలు ఆలయాలు. అద్భుత శిల్పకళా సంపదలకు నిలయాలు మన దేవాలయాలు. గ్రామ పాలనా కేంద్రాలుగా, న్యాయ కేంద్రాలుగా, సమాజానికి మార్గదర్శక కేంద్రాలుగా దేవాలయాలు నిర్వహించబడేవి. అందుకే దేవాలయాలు మన శ్రద్ధాకేంద్రాలు. ఒకానొకప్పుడు దేవాలయం పంచాలయ వ్యవస్థగా నిర్వహించబడేది. దేవాలయము, విద్యాలయము, గ్రంథాలయము, శరణాలయము, వైద్యాలయము అనే పంచాలయాలుగా మన దేవాలయ వ్యవస్థ ఉండేది.

800 సంవత్సరాల ముస్లిం దురాక్రమణదారుల దండయాత్రలలో హిందూ దేవాలయాలు దాడులకు, దోపిడీకి, ధ్వంసానికి గురి అయ్యాయి. ఆ తర్వాత 200 సంవత్సరాలు క్రైస్తవ బ్రిటిష్ పాలనలో దేవాలయాల ఆస్తులు, ఆదాయాలు లూటీ చేయబడ్డాయి. బలవంతంగా దేవాలయాలను స్వాధీనం చేసుకొని ఆర్థిక దోపిడీ చేసారు. హిందూ సమాజం వేయి సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించినా దేవాలయాల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసింది. భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వతంత్ర ఫలాలను జాతికి అందించడంలో హిందువులు ఎన్నో బలిదానాలు చేశారు. స్వతంత్ర మహోద్యమ ఉద్దేశం కేవలం పాలనాపగ్గాలు చేపట్టడం కోసం మాత్రమే కాదు. మన శ్రద్ధాకేంద్రాలను పరిరక్షించుకోవడం కోసమే హిందూ సమాజం ఉవ్వెత్తున ఉద్యమించింది.

దేశానికి స్వతంత్రం అయితే సాధించుకున్నాం కానీ దేవాలయాల విషయంలో ఇప్పటికీ హిందూ సమాజం స్వతంత్రతను పొందలేకపోయింది. స్వతంత్ర భారతావనిలో తమ ప్రార్ధనా మందిరాలను క్రైస్తవ, ముస్లిం సమాజం స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నా, ఈ జాతి వారసులైన హిందువులను మాత్రం వంచనకు గురిచేస్తూ హిందువుల దేవాలయాలను ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా హిందువుల దేవాలయాలకు స్వతంత్రత సిద్ధించలేదు.

వందల సంవత్సరాలుగా హిందూ దేవాలయాలు దోపిడీకి గురి అవుతున్నాయి. దేవాలయ వ్యవస్థ, భక్తుల విశ్వాసాలు, మనోభావాలు, నేడు పెను ప్రమాదంలో పడ్డాయి. హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి దేవాదాయ శాఖచే ప్రభుత్వం నిర్వహిస్తున్న దేవాలయాల్లో కనపడుతోంది. దేవాలయాలలో హిందువులు భక్తితో హండీలలో సమర్పించిన ముడుపులు, కానుకలు దుర్వినియోగం అవుతున్నాయి. దేవాలయాల కమిటీలలో హైందవేతరులను, నాస్తికులను నియమించి హిందూ విశ్వాసాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి. ప్రభుత్వాల గుప్పెట్లోకి చేరిన మన దేవాలయాలు పాలకులకు ఆదాయ వనరులుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. దేశంలో అనేక రాజకీయ పార్టీలు దేవాలయాలను దోచుకోవడమే కాకుండా, హిందూ ఆలయ వ్యవస్థను నాశనం చేసే తమ ఎజెండాను కూడా అమలు చేస్తున్నాయి. హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్ననాడు హిందువుల ధార్మిక విశ్వాసాలకు గౌరవము, రక్షణ కలుగుతాయి.

ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి కూడా అవుతుంది. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్స్ ఉల్లంఘన అవుతుంది. గౌరవ న్యాయస్థానాలు దేవాలయ నిర్వహణలలో, భూముల, ఆస్తుల స్వాధీనంలో ప్రభుత్వాలకు అధికారం లేదని తీర్పులు కూడా ఇచ్చాయి. దేవాలయాల వ్యవస్థ పూర్తి ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైందని హిందూ సమాజం భావిస్తున్నది. దేవాలయాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి ఒక ఉత్తమ నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి హిందూ సమాజానికి అప్పచెప్పాలి. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ధర్మాచార్యులు, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాదులు, పరిషత్ పెద్దలు కలిసి అనేక దశాబ్దాలుగా పరిశీలించి, చర్చించి చట్ట సవరణకు అనుకూలంగా ఒక ముసాయిదాను తయారు చేసారు. దీనిని పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి.

చట్టసవరణ చేసేలోగా దేవాలయాలన్నిటా పూజా, ప్రసాదాది సేవలన్నీ అత్యంత భక్తి ప్రపత్తులతో నాణ్యతతో నిర్వహించబడేలా చూడాలి. దీని ఉల్లంఘనలకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. అన్యమతస్థులకు దేవాలయాలలో ఉద్యోగులుగా స్థానం ఇవ్వరాదు. ఉన్న వారిని వెంటనే తొలగించాలి. దేవాలయ ట్రస్టు బోర్డులలో హైందవేతరులను, నాస్తికులను, రాజకీయ వ్యక్తులను నియమించరాదు. అన్యమతస్థులకు దేవాలయ స్థలాలలో వ్యాపారాల నిర్వాహణకు అవకాశం ఈయరాదు. దేవాలయ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి. దేవాలయ ఆదాయాన్ని, స్థిరాస్తులను ప్రభుత్వాలు హిందూధార్మికేతర ప్రజా పాలనాకార్యాలకు వినియోగించరాదు. హిందూ ఆలయాల ఆదాయం ధార్మిక కార్యాలకే వినియోగించాలి. హిందూ సమాజంపై, హిందూ దేవాలయాలపై, ఆశ్రమాలపై, స్వామీజీలపై, దేవీదేవతల విగ్రహాలపై దాడులు చేస్తున్న విద్రోహులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. హిందూ ఆలయ సంపదలను హిందూ శ్రేయస్సు కోసం, ధార్మిక ప్రచారానికి మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ సంక్షేమ, పాలనా కార్యాలకు దేవాలయ సంపదలు, ఆస్తులు, ఆదాయాలు వినియోగించరాదు. ఆలయాలు పంచాలయ వ్యవస్థలుగా తీర్చిదిద్దబడాలి. హరిజన, గిరిజన, ఉపేక్షిత వాడలలో దేవాలయాల నిర్మాణం చేయడం, నిర్వహణ చేయడం, అర్చక శిక్షణ అందించడం చేయాలి. ఆదాయం లేని దేవాలయాల నిర్వహణకు సహకారం అందించాలి. జీర్ణమైన ఆలయాల పునరుద్ధరణ చేయాలి. గ్రామ గ్రామాల్లో ధార్మిక ప్రవచనాల ద్వారా ధర్మ ప్రచారం చేయాలి. పేద అర్చకులను, పురోహితులను ఆదుకోవాలి.

దేశంలో ఇతర మతాలు తమ ప్రార్ధనా స్థలాల నిర్వహణ తామే చూసుకుంటాయి. కానీ, హిందూ సమాజానికి రాజ్యాంగ బద్ధమైన ఈ హక్కు నేటికీ లేకుండా ప్రభుత్వాలుచేశాయి. దేవాలయాల ప్రభుత్వీకరణ చేయడం కాదు హిందూ సామాజీకరణ చేయడం నేటి అవసరం. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ దేశవ్యాప్తంగా ఒక మహా ఉద్యమానికి నాంది పలికింది. దీనిలో భాగంగా దేశంలోని అన్నిరాష్ట్రాల గవర్నర్లకు హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగిస్తూ చట్టసవరణ చేయాలని కోరుతూ సెప్టెంబర్ నెల 30వ తేదీన మెమోరాండం సమర్పించడం జరిగింది.

ఆలయాల స్వయంప్రతిపత్తి కోసం హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సభా నిర్వహణలో భాగంగా ముందుగా జన జాగరణ కార్యక్రమంలో భాగంగా 25 లక్షల కుటుంబాలను సంపర్కం చేయడం, కోటి మంది సంతకాలతో లింక్ ద్వారా ఆన్ లైన్ లో మద్దతు స్వీకరించడం, అన్ని మండలాలలో హిందూ సమ్మేళనాలు నిర్వహణ చేయడం, డిశంబరు 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా ప్రతీ దేవాలయంలో సామూహిక హారతి కార్యక్రమ నిర్వహణ చేయడం జరుగుతున్నది.

హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలన్న డిమాండుతో జాతీయ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ ధర్మాచార్యులతో పాటు విశ్వ హిందూ పరిషత్ జాతీయ నాయకులు కూడా పాల్గొని మార్గదర్శనం అందిస్తారు. విజయవాడలో 2025 జనవరి 5 వ తేదీన నిర్వహించే హైందవ శంఖారావం భారీ సభలో లక్షలాదిగా హిందూ బంధువులు పాల్గొని దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు జరుగుచున్న ఈ ధార్మిక స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములు కావాలి.

మన దీక్ష దేవాలయాల రక్ష

తనికెళ్ల సత్య రవికుమార్
ప్రాంత కార్యదర్శి
విశ్వ హిందూ పరిషత్, ఉత్తరాంధ్ర