News

సైన్స్, ఆధ్యాత్మికత రెండూ అభిన్నం : మోహన్ భాగవత్

77views

ఆధ్యాత్మికతకూ, సైన్స్ కీ ఎలాంటి వైరుధ్యమూ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రెండు రంగాలకూ విశ్వాసం అత్యావశ్యకమని అన్నారు. ఆరెస్సెస్ ప్రచారక్ ముకుల్ కనీత్కర్ రచించిన Banayen Jeevan Praanwaan అన్న పుస్తకాన్ని స్వామి అవధేశానందతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ… గత 2 వేల సంవత్సరాలుగా ప్రపంచం అహంకారంతో తీవ్రంగా ప్రభావితం అవుతోందని, ఇంద్రియ గ్రహణ శక్తి ద్వారా పొందిన జ్ఞానం మాత్రమే సత్యమని మానవాళి విశ్వసించిందన్నారు. మరీ ముఖ్యంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రం వచ్చినప్పటి నుండి మరీ పెరిగిపోయిందన్నారు. అయితే ఇంద్రియ శక్తి ద్వారా వచ్చిన ఈ దృక్పథం పూర్తి అసంపూర్ణమని తేల్చి చెప్పారు.విజ్ఞాన శాస్త్రానికి కొంత పరిమితులు వున్నాయని, అంతేకాకుండా ఆ పరిధిని మించి ఏదీ లేదని కూడా అనడం శుద్ధ తప్పన్నారు.

లౌకిక ప్రపంచాన్ని పరికిస్తూనే.. ఆత్మ పరిశీలనతో కూడిన భారతీయ సనాతన సంస్కృతిని చూస్తూ వుండాలన్నారు. ఇదే మన లక్షణమని గుర్తు చేశారు. అంతర్గత అనుభవాలను లోతుగా శోధించడం ద్వారా పూర్వీకులు నిజ జీవిత సత్యాలను కనుగొన్నారని అన్నారు. ఈ పద్ధతిలో సైన్స్, ఆధ్యాత్మికతకు వైరుధ్యం లేదన్నారు. ఆధ్యాత్మికతలో కూడా నమ్మకం అన్న దానికే కట్టుబడి వుంటుందన్నారు. అయితే దానికి పద్ధతులు భిన్నంగా వుంటాయన్నారు. ఆధ్యాత్మికతలో సాధనం మనస్సని, దీనికి శక్తి జీవశక్తి అని వివరించారు. ఈ ప్రాణశక్తి ఎంత బలంగా వుంటే ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించే శక్తి అంత ఎక్కువ అని అన్నారు.

మనలో ప్రతికణం చైతన్యవంతంగా వుంటుందని, అందువల్ల అవి స్వచ్ఛమైనవని అన్నారు. ఈ పద్ధతి మొత్తం మన జీవితానికి సమగ్ర దృష్టిని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ జాతీయతా దృష్టిలో అయినా, వ్యక్తిగత స్థాయిలో కూడా అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలోనైనా, వ్యక్తిగత స్థాయిలోనైనా తపస్సు అవసరం. దాని మూలంలో ప్రాణ్ శక్తి (ప్రాణశక్తి) ఉంది. భారతదేశం మన కళ్ళ ముందు ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రాణ శక్తితో వుందని, దానిని గుర్తించడంలో విఫలమవుతున్నామని అన్నారు. ఈ ప్రాణశక్తి రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రస్ఫుటంగా కనిపించిందని మోహన్ భాగవత్ అన్నారు.