ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు ఫులే

37views

( నవంబర్‌ 28 – జ్యోతిరావు ఫులే వర్ధంతి )

మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్‌ 1827‌లో జన్మించారు. 28 నవంబర్‌ 1890‌లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై మరింత బిగుసుకుంది. అనంత లక్ష్మణ కాన్హరే, వాసుదేవ బలవంత ఫడ్కే వంటి విప్లవకారులు బలిదానాలు చేసినా, సాధారణ ప్రజలలో స్వాతంత్ర ఇచ్ఛ బైటపడని కాలం అది. ఆంగ్లేయుల పాలనే చాలా బాగుందని భారతీయ విద్యావంతులు శ్లాఘిస్తున్న కాలం అది. మహరాష్ట్ర అనేక సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు. శూద్రులుగా భావింపబడే పువ్వులు అమ్ముకునే కులంలో జ్యోతిరావు జన్మించారు. 13వ ఏటనే వివాహం అయినది. తండ్రి సహకారంతో వివాహానంతరం చదువును కొనసాగించారు. జాన్‌స్టువర్ట్ ‌మిల్‌ ‌వ్రాసిన ‘ఆన్‌ ‌లిబర్టీ’, థామస్‌ ‌పెయిన్‌ ‌వ్రాసిన ‘ది డిగ్నిటీ ఆఫ్‌ ‌మాన్‌’ అనే గ్రంథాలు, జార్జి వాషింగ్టన్‌, ‌శివాజీల జీవితచరిత్రలు జ్యోతిరావు జీవనంపై చెరగని ముద్రవేశాయి. ఆనాడు హిందూ సమాజంపై బ్రాహ్మణ (పురోహిత) వర్గ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శూద్ర, అతి శూద్ర (అశ్పృశ్య) వర్గాల సమానతకోసం ఉన్నతికోసం కృషిచేశారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అని గుర్తించి శూద్ర, అతి శూద్ర వర్గాల ఉన్నతికోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించటం కోసం కృషిచేశారు. స్వయంగా తన భార్య సావిత్రిబాయి చేత అతిశూద్ర మహిళలకోసం పాఠశాలను ప్రారంభింపచేశారు. తన ఇంటిలోని బావిలో అతి శూద్రులు నీటిని తోడు కోవటంకోసం అవకాశం కల్పించిన మహా పురుషుడు. హంటర్‌ ‌కమీషనర్‌కు నివేదిక సమర్పిస్తూ – శూద్ర, అతిశూద్ర మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించా లనీ, ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యమివ్వాలనీ, విద్యలో ఉపాధికల్పన, నైతిక విలువలు, ఆరోగ్య అంశాలు ఉండాలని, రైతు వర్గాల నుండి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఆనాడే వారు పేర్కొన్నారు.

బాల్య వివాహాలను, వితంతు స్త్రీలకు శిరోముండనం వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. బ్రాహ్మణ పూజారి వర్గ ఆధిపత్యానికి నిరసనగా 24 డిసెంబర్‌ 1873‌లో సత్యశోధక సమాజాన్ని ప్రారంభించారు. ‘‘మనందరం దేవుని సంతానం. దేవుని దృష్టిలో మనందరం సమానం. ఈ భేదాలు మనం సృష్టించుకున్నవే. దేవునికి, మనిషికి మధ్య మరొక మధ్యవర్తి అవసరం లేదు. నిర్బంధ విద్య, స్వదేశీ వస్తు వినియోగం ఆచరించాలి. మూఢాచారాలను వ్యతిరేకించాలి. మతపరమైన శుభ, అశుభ కార్యాలు, వివాహం తక్కువ ఖర్చుతో చేయాలి.’’ – ఇవి ఆయన ప్రారంభించిన సత్యశోధక సమాజపు ముఖ్య లక్ష్యాలు. బ్రాహ్మణ పూజారి లేకుండానే వివాహాలు చేయించాడు. మరాఠి భాషలో వివాహం చేయించే విధానాన్ని రూపొందింప చేశారు.

5 సెప్టెంబర్‌ 1875‌న ఆర్యసమాజ ప్రచార కార్యక్రమ భాగంలో స్వామి దయానంద సరస్వతి పూనాకు వచ్చినపుడు వారి కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా విజయవంతం చేసిన విశాల హృదయుడు జ్యోతిరావు. నిమ్నవర్గాలను సైతం తనపాలనలో సముచిత స్థానం కల్పించిన శివాజి జీవితాన్ని కొనియాడుతూ శివాజి చరిత్ర పై కవితలతో పుస్తకం రాశారు. గుర్తింపులేకుండా పడియున్న శివాజీ సమాధిని బైటకుతీసి తన సొంత ఖర్చుతో దర్శనీయ స్థలంగా చేశారు. మీ ఆంగ్లేయ పరిపాలనాకాలంలో మా సామాజిక పరిస్థితుల్లో రైతుల పరిస్థితుల్లో ఏమి మంచి మార్పు రాలేదంటూ నిర్భయంగా 1888లో బ్రిటీషు యువరాజు ముందు ప్రసంగించిన ధీరోదాత్తుడు జ్యోతిరావు. అందరూ ఆడంబరంగా సూటు బూటు ధరించివచ్చిన బ్రిటీషు యువరాజు గౌర వార్ధపు విందుకు ఒక పల్లెటూరి పేదరైతుగా ధోవతి, అంగీ, తలపాగా, గొంగళి ధరించి వచ్చిన సాహసి.

సంతానం లేదు కనుక మరో వివాహం చేసుకోమని తండ్రి, కుటుంబసభ్యులు ఎంత వత్తిడి చేసిన మరో వివాహానికి అంగీకరించలేదు. పిల్లలు లేకపోవడానికి భార్యే కారణం ఎందుకు కావాలి ? భర్తలో కూడా లోపం ఉండచ్చుకదా! అని ఎదురు ప్రశ్న వేశారు. కాశీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తను కోల్పోయి గర్భవతిగా ఉండటం తటస్థించింది. ఆమెను జ్యోతిరావు చేరదీసి రక్షణ కల్పించాడు. ఒక పిల్లవాడిని కని ఆమె చనిపోయింది. ఆ బాలుడికి యశ్వంత్‌ అని నామకరణం చేసి ఆ బాలుడినే దత్తపుత్రుడుగా స్వీకరించిన విశాలహృదయుడు జ్యోతిరావు ఫులే. వారు మంచి కవి, రచయిత, వక్త. అనేకమంది అనుయాయులను నిర్మాణంచేసుకుని తన తరవాతకూడా తను ప్రారంభించిన సామాజిక ఉద్యమం కొనసాగేట్లు కృషిచేసిన ఉద్యమకారుడు ఆయన.

తాను నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఒక అతిశూద్ర ఉపాధ్యాయుడు పేదరికం కారణంగా క్రైస్తవమతం స్వీకరిస్తున్నాడని తెలిసి, ఆ ఉపాధ్యాయుని జీతంపెంచి క్రైస్తవ మతమార్పిడి సరికాదని నచ్చచెప్పాడు. హిందూమతంలోని దురాచారాలు లోపాలకు వ్యతిరేకంగా జీవితాంతం ఉద్యమించిన క్రైస్తవ మత మార్పిడి సమస్యకు పరిష్కారం కాదని సత్యశోధసమాజం ద్వారా పురోహిత వర్గం అవసరంలేని నూతన సమ సమాజం కోసం కృషిచేశారు. వారి రచనలలో ఏకమయ (ఏకాత్మత), ఏకమయలోక (ఏకాత్మరాష్ట్ర), శబ్దప్రయోగాలు ఎక్కువగా చేశారు. తాను వ్రాసే ఉత్తరాలపైన ‘సత్యమేవ జయతే’ అని వ్రాసేవారు. జీవిత చరమాంకంలో అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురి అయ్యారు. ప్రజలచే మహాత్మునిగా గౌరవించబడ్డారు. సామాజిక సమతా ఉద్యమానికి మహాత్మా జ్యోతిరావు ఫులేను సమకాలిన యుగంలో మొదటి వ్యక్తిగా పేర్కొనాలి.